
Crime News: కుక్క పిల్లకు తన భార్య మారుపేరు పెట్టారంటూ వివాదం
గుజరాత్లో మహిళపై కిరోసిన్ పోసి నిప్పంటించిన పొరుగింటివారు
భావ్నగర్: కుక్క పిల్లకు కావాలనే మారుపేరు పెట్టిందంటూ గుజరాత్లో ఓ మహిళపై పొరిగింటివారు దాడి చేశారు. కిరోసిన్ పోసి నిప్పంటించారు. తీవ్రగాయాల పాలైన ఆ మహిళ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. భావ్నగర్ జిల్లా పలిటానా పట్టణంలో ఉండే నీతాబెన్ సర్వైయా (35) ఓ కుక్క పిల్లను పెంచుకుంటోంది. దానికి ‘సోను’ అని పేరుపెట్టుకుంది. పొరిగింట్లో ఉండే వ్యక్తి సురభాయ్ భార్వాడ్ భార్య మారుపేరు కూడా సోనూయే. దీంతో వారు అభ్యంతరం తెలిపారు. ఆ తర్వాత రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. దీంతోపాటు నీటి కోసం కూడా గొడవలు జరిగినా.. తర్వాత వాటిని సామరస్యంగా పరిష్కరించుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో సోమవారం నీతాబెన్ భర్త, ఇద్దరు పిల్లలు బయటకు వెళ్లగా ఆమె ఇంట్లో పనులు చేసుకుంటోంది. ఆ సమయంలో చిన్న కుమారుడు ఆమెతోపాటు ఉన్నాడు. ఇదే అదునుగా భావించిన సురభాయ్ భార్వాడ్ సహా ఆరుగురు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం నేరుగా వంటగదిలోకి వెళ్లిన ముగ్గురు వ్యక్తులు నీతాబెన్పై కిరోసిన్ పోసి నిప్పుపెట్టారు. మంటలకు తాళలేక ఆమె కేకలు పెట్టడంతో ఇరుగుపొరుగువారు అక్కడకు చేరుకున్నారు. సరిగ్గా అదే సమయంలో నీతాబెన్ భర్త రావడంతో.. ఆయన కోటుతో మంటలను ఆర్పారు. బాధితురాలు ప్రస్తుతం భావ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ వ్యవహారానికి సంబంధించి ఆరుగురిపై కేసు నమోదు చేశామని, ఎవరినీ ఇంకా అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.