మరింత వేగంగా.. కచ్చితంగా

కరోనా సోకిందీ, లేనిదీ మరింత వేగంగా, ఇంకాస్త కచ్చితంగా నిర్ధరించే సరికొత్త విధానాన్ని మసాచూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. పైగా, ఈ పరీక్షకు అయ్యే ఖర్చూ తక్కువే! కొవిడ్‌ నిర్ధారణకు

Published : 23 Dec 2021 04:34 IST

 కొవిడ్‌ నిర్ధారణకు కొత్త పరీక్షను రూపొందించిన అమెరికా శాస్త్రవేత్తలు

బోస్టన్‌: కరోనా సోకిందీ, లేనిదీ మరింత వేగంగా, ఇంకాస్త కచ్చితంగా నిర్ధరించే సరికొత్త విధానాన్ని మసాచూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. పైగా, ఈ పరీక్షకు అయ్యే ఖర్చూ తక్కువే! కొవిడ్‌ నిర్ధారణకు ప్రస్తుతం ర్యాపిడ్‌, పీసీఆర్‌ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. అయితే, వైరస్‌ తీవ్రత ఏ స్థాయిలో ఉందన్నది మాత్రం ఈ రెండు పరీక్షల్లోనూ కచ్చితంగా తెలియట్లేదు. సుమారు నాలుగో వంతు పీసీఆర్‌ పరీక్షల్లో ఫలితాలు తప్పుగా వస్తున్నాయి. అయితే, ఎంఐటీ శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన విధానంలో కేవలం ఒక్క సెకెనులోనే వైరల్‌ ఆర్‌ఎన్‌ఏలను సులభంగా గుర్తించవచ్చు. ‘‘అతిసూక్ష్మ పరిమాణంలో ఉండే నానో-డైమండ్లకు ఒక ప్రత్యేక పదార్థాన్ని పూశాం. ఇది కరోనా వైరస్‌ ఆర్‌ఎన్‌ఏ సీక్వెన్స్‌ను ఇట్టే గుర్తిస్తుంది. వ్యక్తుల నుంచి సేకరించిన నమూనాల్లో వైరస్‌కు సంబంధించిన ఆర్‌ఎన్‌ఏ ఉంటే... అవి ఈ పదార్థానికి అతుక్కుపోతాయి. అప్పుడు నానో-డైమండ్‌ కాంతిలో మార్పు వస్తుంది. లేజర్‌ ఆధార ఆప్టికల్‌ సెన్సర్‌ దీన్ని గుర్తించి, ఫలితాన్ని వెల్లడిస్తుంది. ప్రస్తుతానికి ఇది ప్రయోగశాల దశలోనే ఉంది. ఈ విధానంలో పరీక్షలు నిర్వహించేందుకు అనువుగా పరికరాలను రూపొందించే క్రతువు కొనసాగుతోంది’’ అని పరిశోధకులు వివరించారు. నానో లెటర్స్‌ పత్రిక ఈ వివరాలను అందించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని