Omicron:ఆఖరి ఆందోళనకర వేరియంట్‌ ఇదే?

కరోనా కొత్త వేరియంట్‌- ‘ఒమిక్రాన్‌’ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేస్తున్న తరుణంలో బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కాస్త ఊరట కలిగించే విషయాలను...

Updated : 24 Dec 2021 07:22 IST

  శీతాకాలంలో కొవిడ్‌ ఇక సర్వసాధారణమే: కేంబ్రిడ్జి

కేంబ్రిడ్జి: కరోనా కొత్త వేరియంట్‌- ‘ఒమిక్రాన్‌’ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేస్తున్న తరుణంలో బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కాస్త ఊరట కలిగించే విషయాలను వెల్లడించారు. కొవిడ్‌ కారక సార్స్‌-కొవ్‌-2 వైరస్‌ తరగతిలో ఇదే ఆఖరి ఆందోళనకర రకం అయ్యుండొచ్చని జోస్యం చెప్పారు. ఒకవేళ భవిష్యత్తులో మరిన్ని ఉత్పరివర్తనాలు సంభవించినా.. అవి ప్రమాదకరంగా మారకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఫ్లూ సీజన్‌ తరహాలోనే ఏటా ఇకపై శీతాకాలంలో కొవిడ్‌ సీజన్‌ సర్వసాధారణ అంశంగా మారే అవకాశముందని పేర్కొన్నారు.

కేంబ్రిడ్జి శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. సాధారణంగా వైరస్‌ల్లో వచ్చే ఉత్పరివర్తనాలు దాని వ్యాప్తి, వ్యాధి తీవ్రతను పెంచుతాయి. ఆల్ఫా, డెల్టా తదితర ఇతర వేరియంట్‌లతో పోలిస్తే ఒమిక్రాన్‌ విస్తరణ వేగం అధికంగా ఉండటానికి ఉత్పరివర్తనాలే కారణం. అయితే- అన్ని వైరస్‌ల హాని తీవ్రత ఏదో ఒక దశలో గరిష్ఠ స్థాయికి చేరుతుంది. ఆ తర్వాత ఎన్ని ఉత్పరివర్తనాలు సంభవించినా.. రోగనిరోధక వ్యవస్థకు వెంటనే చిక్కకుండా తప్పించుకోగలుగుతాయే తప్ప అంతగా ప్రమాదకరంగా పరిణమించవు. ఒమిక్రాన్‌ రూపంలో సార్స్‌-కొవ్‌-2 ప్రస్తుతం ఈ దశలోనే ఉంది! కాబట్టి భవిష్యత్తులో వచ్చే వేరియంట్లతో మరణాల ముప్పు పెరిగే అవకాశాల్లేవు. వ్యాప్తి వేగం పెరిగేలా మాత్రం కొత్త వేరియంట్లు పుట్టుకురావొచ్చు. అంటే- కరోనాలో ఒమిక్రాన్‌ ఆఖరి వేరియంట్‌ కాదు! కానీ ఇదే ఆఖరి ఆందోళనకర వేరియంట్‌ కావొచ్చు! సాధారణ జలుబును కలిగించే వైరస్‌గా సార్స్‌-కొవ్‌-2 మిగిలిపోవచ్చు. ఏటా చలికాలంలో కొవిడ్‌ సీజన్‌ సర్వసాధారణంగా మారొచ్చు. గతంలోనే కరోనా బారినపడి ఉండటం, టీకాలు తీసుకోవడం వంటి కారణాల వల్ల మనుషుల్లో కరోనాకు వ్యతిరేకంగా పటిష్ఠ రోగనిరోధక వ్యవస్థ ఏర్పడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని