Antarctica: అంటార్కిటికాలో 3,600 కి.మీ. పాదయాత్ర

రక్తం గడ్డకట్టేంత అతి శీతల వాతావరణం ఉండే అంటార్కిటికా ఖండంలో ఇద్దరు సాహసికులు చరిత్రాత్మక యాత్రకు శ్రీకారం చుట్టారు. మైనస్‌ 55 డిగ్రీలకు పడిపోయే ఉష్ణోగ్రతలు.. అడుగడుగునా పొంచి

Updated : 25 Dec 2021 13:31 IST

దేహాన్నే ప్రయోగశాలగా మార్చిన ఇద్దరు సాహసికులు

లండన్‌: రక్తం గడ్డకట్టేంత అతి శీతల వాతావరణం ఉండే అంటార్కిటికా ఖండంలో ఇద్దరు సాహసికులు చరిత్రాత్మక యాత్రకు శ్రీకారం చుట్టారు. మైనస్‌ 55 డిగ్రీలకు పడిపోయే ఉష్ణోగ్రతలు.. అడుగడుగునా పొంచి ఉండే ప్రమాదాలను దాటుకుంటూ 3,600 కి.మీ. పాదయాత్రను చేపట్టారు. తమతోపాటు 200 కిలోల బరువుండే పరికరాలను స్లెడ్జ్‌పై ఈడ్చుకుంటూ వెళ్తున్నారు. 80 రోజులపాటు సాగే ఈ యాత్ర వెనుక శాస్త్ర, విజ్ఞాన రంగం కోసం తమ దేహాలనే ప్రయోగశాలగా మార్చిన ఆశయం ఉంది. అంగారక గ్రహంతోపాటు చంద్రుడిపై మానవుల ఆవాసానికి అనువైన వాతావరణంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. అక్కడ ఉండే కఠిన పరిస్థితులకు మానవ దేహం ఎలా ప్రతిస్పందిస్తుంది? శరీరంలో ఏయే మార్పులు చోటుచేసుకుంటాయి? అనే విషయాలపై అధ్యయనం చేస్తున్నారు. అందులో భాగంగా అత్యంత అసాధారణ పరిస్థితులుండే అంటార్కిటికా ఖండంలో గడిపినప్పుడు మానవ దేహంలో చోటుచేసుకునే మార్పులను పరిశీలించడానికి సంకల్పించారు. నాసా, యురోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ, స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ‘ఛేజింగ్‌ ది లైట్‌’ పేరుతో చేపట్టిన ఈ మిషన్‌లో పాలుపంచుకునేందుకు బ్రిటన్‌కు చెందిన జస్టిన్‌ పాక్షా, జేమీ పేసర్‌ చైల్డ్స్‌ అనే సాహసికులు ముందుకొచ్చారు. నవంబరు 12న అంటార్కిటికాలోని నొవొలజరెవ్‌స్కయా పరిశోధన కేంద్రం నుంచి వీరు ఈ యాత్రను ప్రారంభించారు. డిసెంబరు 15 నాటికి 1,083 కి.మీ. పూర్తి చేశారు. కైట్‌ సర్ఫింగ్‌తో పాటు ప్రధానంగా కాలినడకతో ప్రయాణిస్తున్నారు.

పరిశోధనలేంటి?

అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురైనప్పుడు మానవ శరీరం, మానసిక ఆరోగ్యంపై పడే ప్రభావాన్ని అంచనా వేయడానికి అవసరమైన సమాచారాన్ని సేకరించనున్నారు. ఒంటరితనం, సూక్ష్మజీవుల మనుగడ, రోగనిరోధక వ్యవస్థపై ప్రభావాన్ని తెలుసుకోనున్నారు. ఇది అంతరిక్ష యాత్రల విషయంలో కీలకం కానుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని