Sharad Pawar:పాలనపై మోదీకి గట్టి పట్టుంది

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏదైనా ఒక పనిని ప్రారంభించారంటే అది పూర్తయ్యే వరకు విశ్రమించరంటూ ఆయన నిర్వహణ శైలిని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ ప్రశంసించారు. పరిపాలనపైనా మోదీకి గట్టి పట్టుందని,

Updated : 30 Dec 2021 13:07 IST

ప్రధాన మంత్రికి శరద్‌ పవార్‌ కితాబు

పుణె: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏదైనా ఒక పనిని ప్రారంభించారంటే అది పూర్తయ్యే వరకు విశ్రమించరంటూ ఆయన నిర్వహణ శైలిని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ ప్రశంసించారు. పరిపాలనపైనా మోదీకి గట్టి పట్టుందని, అదే ఆయన బలమని తెలిపారు. మరాఠి దిన పత్రిక ‘లోక్‌సత్తా’ బుధవారం పుణెలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న శరద్‌ పవార్‌ ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘తన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని ప్రభావవంతంగా అమలుచేసేందుకు పాలనాయంత్రాంగం, సహచర మంత్రులు ఏకతాటిపై నడిచేలా చేయడం మోదీ ప్రత్యేకత. ఈ తరహా పద్ధతి మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తదితరుల్లో కనిపించదు’’ అని పవార్‌ అభిప్రాయపడ్డారు. 

1993లో అయిష్టంగానే సీఎం బాధ్యతలు

కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన రక్షణ శాఖ మంత్రిగా ఉన్న తాను 1993లో అయిష్టంగానే, భావోద్వేగ పరిస్థితుల్లో ఆ పదవిని వదిలిపెట్టి మహారాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టాల్సి వచ్చిందని శరద్‌ పవార్‌ తెలిపారు. బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం ముంబయిలో చెలరేగిన అల్లర్లను అణచివేసి శాంతిని నెలకొల్పడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించక తప్పలేదన్నారు. ‘‘1992 డిసెంబరులో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం ప్రారంభమైన అల్లర్లు ముంబయిని కుదిపేశాయి. రెండు వారాలకు పైగా జనజీవనం స్తంభించింది. అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు... రక్షణ శాఖ మంత్రిగా ఉన్న నన్ను రాష్ట్రానికి వెళ్లి ముఖ్యమంత్రి పదవిని స్వీకరించాలని ఆదేశించగా తిరస్కరించాను. అల్లర్లు మరిన్ని నగరాలకు విస్తరించాయి. దీంతో పీవీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఎన్‌కేపీ సాల్వే, నేను, మరి కొందరు నేతలు సమావేశమయ్యాం. ఆ తర్వాత పీవీ నన్ను ఆయన కార్యాలయానికి పిలిపించారు.  మహారాష్ట్ర సీఎంగా వెళ్లడం మినహా మరో మార్గం కనిపించడంలేదని చెప్పారు. ఆరు గంటల పాటు నన్ను ఒప్పించే ప్రయత్నం జరిగింది. చివరకు..నీవు పుట్టి పెరిగిన రాష్ట్రం, నగరం... తగలబడిపోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో బాధ్యతలు తీసుకోవడానికి వెనక్కితగ్గితే అంతకన్నా విచారకరం మరొకటి ఉండదని అన్నారు. భావోద్వేగానికి గురైన నేను రాష్ట్రానికి తిరిగి వచ్చాను’’ అని శరద్‌ పవార్‌ వివరించారు. ముఖ్యమంత్రి పదవిని చేపట్టి రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించడం సంతృప్తినిచ్చిందని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు