Work From Home: 50% సిబ్బందికి ఇంటి నుంచి పని

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అండర్‌ సెక్రటరీ కంటే దిగువస్థాయి ఉద్యోగుల్లో 50 శాతం మంది ఇంటి నుంచే పనిచేసేందుకు అనుమతించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.

Updated : 04 Jan 2022 11:34 IST

అండర్‌ సెక్రటరీ కంటే దిగువస్థాయి ఉద్యోగులకు కేంద్రం అనుమతి

దిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అండర్‌ సెక్రటరీ కంటే దిగువస్థాయి ఉద్యోగుల్లో 50% మంది ఇంటి నుంచే పనిచేసేందుకు అనుమతించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. గర్భిణులు, దివ్యాంగులు కార్యాలయాలకు రావడంపై మినహాయింపు ఇచ్చింది. అదే సమయంలో సిబ్బంది కార్యాలయాలకు వచ్చేందుకు, కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లేందుకు రెండు సమయాలను నిర్ణయించింది. ఉదయం 9 గంటలకు వచ్చినవారు సాయంత్రం 5.30 గంటలకు, ఉదయం 10 గంటలకు వచ్చినవారు సాయంత్రం 6.30 గంటలకు వెళ్లాలని ఆదేశించింది. రాకపోకల సమయంలో రద్దీని నివారించేందుకే ఈ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. కంటెయిన్‌మెంట్‌ ప్రాంతాల్లో ఉండేవారు కూడా కార్యాలయాలకు రానక్కర్లేదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అండర్‌ సెక్రటరీ, అంతకంటే ఎక్కువ ర్యాంకుల్లో ఉన్న అధికారులు కార్యాలయాలకు రావాల్సి ఉంటుందని పేర్కొంది. కార్యాలయాల్లో జరిగే సమావేశాలను వీలైనంత మేరకు వీడియో సమావేశం విధానంలో నిర్వహించాలని సూచించింది. కార్యాలయాలకు వచ్చే సందర్శకులతో భేటీ అవడం అత్యవసరం, తప్పనిసరి అయితే తప్ప విరమించుకోవాలని తెలిపింది. మాస్కులు ధరించడం, చేతులను శుభ్రం చేసుకోవడం సహా కార్యాలయాల్లో కరోనా మార్గదర్శకాలు కచ్చితంగా అమలయ్యేలా అధికారులు అంతా జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని