
కొవాగ్జిన్‌పై తపాలా స్టాంపు
దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ కలలు కంటున్న ‘స్వావలంబన భారత్’ సాధనలో కొవాగ్జిన్ టీకా తయారీ ఓ కీలక పరిణామమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. దేశంలో కరోనా టీకా పంపిణీ ప్రారంభమై ఏడాది పూర్తయిన నేపథ్యంలో.. దేశీయ దిగ్గజ ఔషధ తయారీ సంస్థ భారత్ బయోటెక్, భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా ప్రాముఖ్యతను గుర్తిస్తూ మాండవీయ ఆదివారం తపాలా స్టాంపును ఆవిష్కరించారు. వీడియో లింక్ ద్వారా ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో కొవిడ్ టీకా పంపిణీ యజ్ఞాన్ని చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపోయిందని.. అది భారతీయులకు గర్వకారణమని మాండవీయ పేర్కొన్నారు. ‘‘కొవిడ్‌పై పరిశోధనలు జరిపేలా, దేశీయంగా టీకాను అభివృద్ధి చేసేలా శాస్త్రవేత్తలను ప్రధాని ప్రోత్సహించారు. దేశంలో మానవ వనరులకు, మేధస్సుకు లోటు లేదు. ప్రభుత్వం, ప్రైవేటు రంగం కలసికట్టుగా కృషిచేయడంతో.. 9 నెలల వ్యవధిలోనే దేశీయంగా కరోనా టీకా అందుబాటులోకి వచ్చింది’’ అని చెప్పారు.