
బలవంతంగా టీకాలు వేయడం లేదు
సుప్రీంలో కేంద్రం ప్రమాణపత్రం
దిల్లీ: దేశంలో ఎక్కడా బలవంతంగా టీకా కార్యక్రమం జరగడం లేదని కేంద్రం సోమవారం సుప్రీం కోర్టుకు తెలిపింది. తప్పనిసరిగా టీకా వేసుకోవాలన్న నిబంధన కూడా లేదని పేర్కొంది. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొనే ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని చెప్పింది. వ్యక్తి అనుమతి తీసుకొని, అతనికి కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాతే టీకా వేస్తున్నామని స్పష్టం చేసింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం ముందు ప్రమాణ పత్రం దాఖలు చేసింది. దివ్యాంగులకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సరళతరం చేయాలని, ఇంటింటికి వెళ్లి టీకాలు వేసే ఏర్పాట్లను ప్రభుత్వం చేయాలని కోరుతూ ఓ స్వచ్ఛంద సంస్థ పిటిషన్ వేసింది. దీనికి కేంద్రం సమాధానం చెబుతూ...స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన 23,678 మంది దివ్యాంగులకు ఇప్పటివరకు టీకాలు వేశామని పేర్కొంది.. టీకా ధ్రువపత్రాల విషయంలో వికలాంగులకు మినహాయింపివ్వాలన్న అంశంపైనా కేంద్రం స్పందించింది. ఏ విషయంలో కూడా టీకా ధ్రువపత్రాలు సమర్పణ తప్పనిసరంటూ తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని తెలిపింది. వ్యాక్సినేషన్‌కు అర్హత ఉండి గుర్తింపు పత్రం లేనివారికి కూడా తాము టీకాలు వేస్తున్నామని వెల్లడించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.