
Remdesivir: కొవిడ్ చికిత్సలో రెమ్‌డెస్‌విర్‌కు చోటు
ఐసీఎంఆర్ నూతన మార్గదర్శకాలు
ఈనాడు, దిల్లీ: కొవిడ్ లక్షణాలు కనిపించిన పది రోజుల్లోపు ఆక్సిజన్ అవసరమైన రోగుల చికిత్స కోసం (మధ్యస్థాయి నుంచి తీవ్రమైన లక్షణాలు) రెమ్‌డెస్‌విర్ ఔషధాన్ని ఉపయోగించడానికి ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది. సోమవారం జారీచేసిన నూతన కొవిడ్ ప్రొటోకాల్స్‌లో ఈ విషయాన్ని పేర్కొంది. ఆక్సిజన్ అవసరం లేనివారికి, ఇళ్లలోనే ఉండి కోలుకుంటున్న వారికి దీన్ని వాడకూడదని స్పష్టం చేసింది. కేవలం ఆసుపత్రుల్లో, అందునా ఆక్సిజన్ అందిస్తున్నవారికి మాత్రమే 5 రోజులపాటు దీన్ని ఉపయోగించాలని పేర్కొంది. అంతకుమించి ఈ ఔషధాన్ని వాడినవారిలో మంచి ఫలితాలు వస్తున్నట్టు ఆధారాలేవీ లేవని తెలిపింది. తొలిరోజు 200 ఎంజీ, ఆ తర్వాత నాలుగు రోజులు 100 ఎంజీ చొప్పున వాడాలని విస్పష్టంగా సూచించింది. కొవిడ్ లక్షణాలు తీవ్రరూపం దాలుస్తూ, ఆక్సిజన్ అవసరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నవారికీ... స్టెరాయిడ్లకు తగిన స్పందన లేనివారికి టొసిలిజుమాబ్‌ను ఇవ్వొచ్చని పేర్కొంది. లక్షణాలు తీవ్రమైన 24-48 గంటల్లోపుగానీ, ఐసీయూలో చేరిన వెంటనేగానీ దీన్ని ఉపయోగించవచ్చని తెలిపింది. స్టెరాయిడ్స్‌తో కలిపి టొసిలిజుమాబ్ ఇవ్వడం మంచిదని పేర్కొంది. అయితే ఇది ఇచ్చినవారికి టీబీ, ఫంగల్, సిస్టమిక్ బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ ఉండకూడదని తెలిపింది. సెకెండరీ ఇన్‌ఫెక్షన్లు తలెత్తకుండా బాధితులను దీర్ఘకాలం పరిశీలిస్తూ ఉండాలని పేర్కొంది. కొత్త మార్గదర్శకాల్లో మోల్నుపిరవిర్‌ను మాత్రం ప్రభుత్వం చేర్చలేదు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.