
భర్త దక్కకున్నా.. పదిమందికి సాయపడాలని...
రూ.40 లక్షలు ఇచ్చేసిన యువతి
కటక్, న్యూస్‌టుడే: ఈ రోజుల్లో చాలామందికి డబ్బే ప్రధానం... ఇందుకోసం ఎంతకయినా వెనుకాడరు. అందుకు భిన్నంగా తనకు పలువురు చేసిన సహాయం మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి, రెడ్‌క్రాస్ సొసైటీకి అందజేసి ఒక మహిళ మానవత్వం చాటుకున్నారు. ఒడిశాలోని భద్రక్ జిల్లా బాసుదేవ్‌పూర్ ప్రాంతానికి చెందిన అభిషేక్ మహాపాత్ర్ ఒమన్‌లో ఇంజినీర్‌గా పనిచేసేవాడు. 2021 మేలో ఆయన మౌసిమి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వారం రోజులకే ఆయనకు కొవిడ్ వచ్చింది. చికిత్సకు డబ్బు లేకపోవడంతో ఆర్థిక సాయం కోసం ఆమె సామాజిక మాధ్యమాల్లో అభ్యర్థనలు పెట్టింది. పలువురు ఆమెకు సాయం అందించారు. దీంతో అభిషేక్‌ను ఎయిర్‌లిఫ్ట్ ద్వారా కోల్‌కతా తరలించి చికిత్స అందించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆమెకు సాయంగా అందిన రూ.40 లక్షలు మిగిలాయి. మౌసిమి సోమవారం భద్రక్ కలెక్టర్ వద్దకు చేరుకొని రూ.30 లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధికి.. రూ.10 లక్షలను రెడ్‌క్రాస్ నిధికి అందించారు. తన భర్త ప్రాణాన్ని కాపాడడానికి పలువురు సహాయం అందించారని, ఆయన లేకపోయినా ఆ మొత్తాన్ని మరికొందరికి ఉపయోగపడాలని అందించానని ఆమె చెప్పారు.