Published : 19 Jan 2022 04:45 IST

రణ్‌వీర్‌ యుద్ధనౌకలో పేలుడు

ముగ్గురు నేవీ సిబ్బంది దుర్మరణం
11 మందికి గాయాలు
ముంబయి నేవల్‌ డాక్‌యార్డ్‌లో దుర్ఘటన

దిల్లీ: భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ రణ్‌వీర్‌లో పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో నేవీకి చెందిన ముగ్గురు సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరికి ముంబయిలోని నౌకాదళ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం 4.30గంటలకు ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ఆ సమయంలో రణ్‌వీర్‌.. ముంబయిలోని నేవల్‌ డాక్‌యార్డ్‌లో ఉంది. యుద్ధనౌకలోని అంతర్గత కంపార్ట్‌మెంట్‌లో ఈ పేలుడు సంభవించిందని నౌకాదళం ఒక ప్రకటనలో తెలిపింది. నౌక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చినట్లు పేర్కొంది. పేలుడు వల్ల నౌకలోని సాధన సంపత్తికి పెద్దగా నష్టం వాటిల్లలేదని వివరించింది. తాజా ప్రమాదంపై నౌకాదళం విచారణకు ఆదేశించింది.

విశాఖ కేంద్రంగా సేవలు..

తూర్పు నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ రణ్‌వీర్‌.. విశాఖపట్నం కేంద్రంగా సేవలు అందిస్తోంది. ఈ నౌకలోని సిబ్బంది కూడా విశాఖలోనే నివాసం ఉంటున్నారు. ‘క్రాస్‌ కోస్ట్‌’ మోహరింపుల్లో భాగంగా ఇది గత ఏడాది నవంబరు నుంచి పశ్చిమ తీరంలో విధులు నిర్వర్తిస్తోంది. త్వరలోనే ఈ యుద్ధనౌక సొంత రేవుకు తిరిగి రావాల్సి ఉంది. ప్రమాద విషయం తెలియగానే విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో విషాదఛాయలు అలుముకొన్నాయి. రాజ్‌పుత్‌ తరగతి డిస్ట్రాయర్‌ యుద్ధనౌకల్లో ఐఎన్‌ఎస్‌ రణ్‌వీర్‌ నాలుగోది. రష్యాలో దీన్ని నిర్మించారు. ఇది 1986 అక్టోబరు 28న భారత నౌకాదళంలో చేరింది. నాటి నుంచి ఇది నేవీలో కీలక పాత్ర పోషిస్తోంది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని