కొలిక్కిరాని ‘హిజాబ్‌’ సమస్య

హిజాబ్‌ (తల, మెడ చుట్టూ ధరించే బురఖా లాంటి వస్త్రం) సమస్యకు పరిష్కారం కనుగొనకుండానే బుధవారం కర్ణాటకలోని ఉడుపి పట్టణంలో నిర్వహించిన అధికారుల సమావేశం

Published : 20 Jan 2022 05:05 IST

కర్ణాటకలో కొనసాగుతున్న వివాదం

ఉడుపి, న్యూస్‌టుడే: హిజాబ్‌ (తల, మెడ చుట్టూ ధరించే బురఖా లాంటి వస్త్రం) సమస్యకు పరిష్కారం కనుగొనకుండానే బుధవారం కర్ణాటకలోని ఉడుపి పట్టణంలో నిర్వహించిన అధికారుల సమావేశం ముగిసింది. ఈనెల ఒకటి నుంచి కొనసాగుతున్న ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందనుకున్న విద్యార్థినులకు నిరాశే మిగిలింది. ఉడుపి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు చెందిన ఆరుగురు ముస్లిం విద్యార్థినులు హిజాబ్‌లను ధరించి రావడాన్ని వ్యతిరేకిస్తూ అధ్యాపకులు వారిని తరగతుల్లోకి అనుమతించలేదు. ఫలితంగా తరగతుల వెలుపలే వీరంతా గడపాల్సి వస్తోంది. సమస్యను పరిష్కరించేందుకు బుధవారం విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాశాఖ అధికారులు, కళాశాల యాజమాన్య ప్రతినిధులు సమావేశమైనా ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. హిజాబ్‌ను ధరించి కళాశాలకు వచ్చేందుకు అనుమతించేదిలేదని, కావాలనుకుంటే ఆ విద్యార్థినులకు టీసీ ఇస్తామని కళాశాల కమిటీ అధ్యక్షుడు, స్థానిక శాసనసభ్యుడు రఘుపతి భట్‌ స్పష్టం చేశారు. ఇటీవలే చిక్కమగళూరు జిల్లాలోని కొప్ప కళాశాలలో ఇదే తరహా వివాదం చోటుచేసుకుంది. ముస్లిం విద్యార్థినులు హిజాబ్‌ ధరించి కళాశాలకు వచ్చినందుకు కొందరు విద్యార్థులు కాషాయ శాలువాలతో తరగతులకు హాజరయ్యారు. తరువాత ఇరు వర్గాలకు నచ్చజెప్పడంతో వాటిని ధరించకుండా వచ్చేందుకు విద్యార్థులు అంగీకరించడంతో కొప్పలో వివాదం సద్దుమణిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని