
వివక్షకు తావులేని వ్యవస్థగా భారత్
కలిసికట్టుగా పనిచేసి సామాజిక రుగ్మతల్ని తొలగిద్దాం
దేశ ప్రజలకు ప్రధాని పిలుపు
బ్రహ్మకుమారీల నేతృత్వంలో ‘అజాదీ అమృత్ మహోత్సవ్..’ కార్యక్రమాల ప్రారంభం
దిల్లీ: భారత దేశం సరికొత్త ఆలోచనలు చేయడంతో పాటు ప్రగతిశీలమైన నిర్ణయాలను తీసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వివక్షకు తావులేని వ్యవస్థ నిర్మాణం జరుగుతోందని తెలిపారు. బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో చేపట్టిన ‘స్వాతంత్య్ర అమృత మహోత్సవం నుంచి స్వర్ణ భారత్ దిశగా’ కార్యక్రమాలను గురువారం ఆయన దిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. అనంతరం ప్రారంభోపన్యాసం చేశారు. స్వాతంత్య్ర అమృత మహోత్సవంలో భాగంగా ఏడాది పొడవునా బ్రహ్మకుమారీల నేతృత్వంలో 30కిపైగా ప్రచార సభలు, 15 వేలకుపైగా వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. దేశాభివృద్ధికి కృషి చేయడం తమ బాధ్యతగా ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటిని అడ్డుకొని మన దేశ సరైన ముఖ చిత్రాన్ని ప్రపంచానికి చాటాల్సి ఉందన్నారు. ‘కొన్ని పరిస్థితుల్లో హక్కుల గురించి మాట్లాడడం సముచితమే. కానీ, బాధ్యతలను పూర్తిగా విస్మరించడం దేశాన్ని బలహీనపరిచే యత్నమే’ అని స్పష్టం చేశారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి సామాజిక రుగ్మతలను సమూలంగా నిర్మూలించి భారత్‌ను సరికొత్త శిఖరాలకు చేర్చాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. వలసపాలనతో దేశం కోల్పోయిన వాటిని సాధించుకునేందుకు వచ్చే 25 ఏళ్లు త్యాగనిరతితో శ్రమించాలని సూచించారు. 2047లో జరుపుకొనే దేశ శత స్వాతంత్య్ర వేడుకలను దృష్టిలో ఉంచుకొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్ర, కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, భూపేంద్ర యాదవ్ తదితరులు ఈ కార్యక్రమంలో వర్చువల్ విధానంలో పాల్గొన్నారు.
దేశంలో ఆందోళనకర వాతావరణం: అశోక్ గహ్లోత్
దేశంలో హింసాయుత, ఆందోళనకర వాతావరణం నెలకొందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తెలిపారు. బ్రహ్మకుమారీలు నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు వర్చువల్ విధానంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత 75ఏళ్లలో దేశంలో ఏమీ అభివృద్ధి జరగలేదన్న ఆరోపణలను ఖండించారు. దేశంలో శాంతి, సామరస్యం, సోదరభావం పెంపొందించాల్సి ఉందని గహ్లోత్ అభిప్రాయపడ్డారు.