టీకాలతో భారీగా తగ్గిన మరణాలు

దేశంలో విస్తృతస్థాయిలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ చేపట్టిన కారణంగా ప్రస్తుత కరోనా మూడో వేవ్‌లో మరణాలు భారీగా తగ్గినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ వెల్లడించారు. వ్యాధి తీవ్రరూపు దాల్చడం, మరణాలు

Published : 21 Jan 2022 06:23 IST

రెండో వేవ్‌తో పోలిస్తే 87% తగ్గుదల : కేంద్రం

ఈనాడు, దిల్లీ: దేశంలో విస్తృతస్థాయిలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ చేపట్టిన కారణంగా ప్రస్తుత కరోనా మూడో వేవ్‌లో మరణాలు భారీగా తగ్గినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ వెల్లడించారు. వ్యాధి తీవ్రరూపు దాల్చడం, మరణాలు సంభవించడం వంటి ముప్పు కొవిడ్‌ టీకాల వల్ల గణనీయంగా తగ్గినట్లు చెప్పారు. దిల్లీలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. రెండో వేవ్‌ సమయంలో గత ఏడాది ఏప్రిల్‌ 30న దేశవ్యాప్తంగా 3,86,452 కేసులు రాగా.. ఆరోజు 3,059 మరణాలు నమోదైనట్లు చెప్పారు. తాజాగా జనవరి 20వ తేదీన దేశంలో 3,17,532 కేసులు నమోదుకాగా, మరణాల సంఖ్య మాత్రం భారీస్థాయిలో తగ్గినట్లు తెలిపారు. ఈమేరకు గత (రెండో) వేవ్‌తో పోలిస్తే ప్రస్తుతం మరణాలు 87.57% మేర తగ్గినట్లు వెల్లడించారు. గత ఏడాది ఏప్రిల్‌ 1న 319 మేర ఉన్న రోజువారీ మరణాల సంఖ్య అదే నెలాఖరుకల్లా 3,059కి చేరిందని (858% పెరుగుదల) చెప్పారు. మూడో వేవ్‌లో ఈ ఏడాది జనవరి 1 నుంచి 20వ తేదీ నాటికి 35% మాత్రమే పెరుగుదల ఉన్నట్లు ఉదహరించారు. గత ఏడాది ఏప్రిల్‌ నాటికి పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ అందుకున్నవారి సంఖ్య కేవలం 2% మేర ఉండగా, ఇప్పుడు అది 72%కి చేరినట్లు చెప్పారు. ప్రస్తుత మూడో వేవ్‌లో కొవిడ్‌తో జ్వరం, దగ్గు, గొంతులో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయని.. 5 రోజుల్లోపు అన్నీ సమసిపోతున్నాయని చెప్పారు. 11 నుంచి 18 ఏళ్ల పిల్లల్లో జ్వరం, అప్పర్‌ రెస్పిరేటరీ ట్రాక్‌ ఇన్‌ఫెక్షన్‌ సర్వసాధారణంగా కనిపిస్తున్నట్లు వెల్లడించారు. ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరామ్‌ భార్గవ మాట్లాడుతూ ఇంట్లో పరీక్ష (హోం టెస్టు)లు చేసుకొనేవారి సంఖ్య భారీగా పెరిగినట్లు చెప్పారు. 2021లో మొత్తంగా 3 వేల హోంటెస్ట్‌లు జరిగితే, ఈ ఏడాది తొలి 20 రోజుల్లోనే 2 లక్షల మేర పరీక్షలు ఇళ్లలో జరిగినట్లు వెల్లడించారు. దేశంలో వ్యాక్సిన్‌ వల్ల చాలా ప్రయోజనం కలిగిందని, మరణాలు భారీగా తగ్గాయన్నారు. ప్రస్తుతం దేశంలో కనిపిస్తున్న మూడో వేవ్‌లో రోగతీవ్రత, మరణాలు పెద్దగా పెరగడం లేదన్నారు. అయితే అనారోగ్య సమస్యలున్న వారు తమ ఆరోగ్యాన్ని పరీక్షించుకుంటూ ప్రమాదాన్ని ముందే పరిహరించుకోవాలని సూచించారు. నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం 16% పాజిటివిటీ రేటు ఉందన్నారు. అత్యధికంగా గోవాలో 50%, కేరళలో 42%, రాజస్థాన్‌లో 31%, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌లలో 30% పాజిటివిటీ రేటు ఉన్నట్లు తెలిపారు. ఈమేరకు అందరూ జాగ్రత్తగా ఉండాలని, వ్యాక్సిన్‌ తీసుకోవాలని పిలుపునిచ్చారు. మొదటి డోస్‌ తీసుకొన్న తర్వాత గడువు ముగిసినా ఇప్పటికీ 6.5 కోట్ల మంది రెండో డోస్‌ తీసుకోలేదని చెప్పారు. రెండో డోసు తీసుకుంటేనే పూర్తిస్థాయి రక్షణ లభిస్తుందన్న విషయాన్ని గమనించి జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.

160 కోట్లకు పైగా టీకా డోసులు..

దేశంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ గురువారం మరో మైలురాయికి చేరుకుంది. ఇంతవరకు ప్రజలకు 160 కోట్లకు పైగా టీకా డోసులు వేశారు. కొవిన్‌ పోర్టల్‌ గణాంకాల ప్రకారం గురువారం రాత్రి 9 గంటల వరకు 160.34 కోట్ల డోసులు పంపిణీ చేశారు.

12-14 ఏళ్లవారికి టీకాలు ఎప్పుడంటే..

శాస్త్రీయ ఆధారాలకు అనుగుణంగానే దేశంలో 12-14 ఏళ్ల వయసువారికి కొవిడ్‌ టీకాలపై నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ విషయమై చర్చలు కొనసాగుతున్నట్లు వీకే పాల్‌ తెలిపారు. దీనిపై పూర్తిస్థాయిలో శాస్త్రీయ సమాచారం అందిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎవరైనా కొవిడ్‌ బారినపడితే 3 నెలల తర్వాతే రెండో లేదా మూడో డోసు తీసుకోవచ్చని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. కాగా జన్యుక్రమ పరిశీలనలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్నట్లు తెలిపారు.

22.66 లక్షల ఆరోగ్య సిబ్బందికి మూడో డోసు..

దేశంలో 63% (22.66 లక్షలు) మంది ఆరోగ్య సిబ్బందికి ముందుజాగ్రత్త (మూడో) డోసు వేసినట్లు రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు. అలాగే ఫ్రంట్‌లైన్‌ వర్కర్లలో 58% (19.14 లక్షలు), దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 60ఏళ్లు పైబడినవారిలో 39% (18.66 లక్షలు) మంది మూడో డోసు పొందినట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని