
35 పాక్ యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం
దిల్లీ: పాక్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ, భారత్‌పై విషం చిమ్ముతున్న 35 యూట్యూబ్ ఛానళ్లతో పాటు పలు ఫేస్బుక్, ట్విటర్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలను కేంద్రం నిషేధించింది. ఈ ఖాతాలను భారత నిఘావర్గాలు చాలా కాలం నుంచి నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇవి భారత్‌పై విద్వేష ప్రచారం చేయడమే కాకుండా, నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్నాయి. నిఘావర్గాల ఆదేశంతోనే వీటి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తూ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి అపూర్వచంద్ర శుక్రవారం తెలిపారు. నిషేధించిన 35 యూట్యూబ్ ఛానళ్లను అనుసరించే వారి సంఖ్య కోటి 20 లక్షలకు పైనే ఉందని,, వీటిని 130 కోట్ల మందికి పైగా వీక్షించారని చంద్ర పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని పాక్ యూట్యూబ్ ఛానళ్ల భరతం పడతామని చెప్పారు. గత డిసెంబర్‌లోనూ పాక్ కేంద్రంగా పనిచేస్తున్న 20 యూట్యూబ్ ఛానళ్లు, రెండు వెబ్సైట్లపై భారత్ ఆంక్షలు విధించింది.