
రాష్ట్రాల వైఖరి వల్లే... ఐఏఎస్ సర్వీస్ నిబంధనల మార్పు
కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ వర్గాల వెల్లడి
దిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి డిప్యుటేషన్‌పై తగినంత మంది అధికారులను రాష్ట్రాలు కేటాయించకపోవడం వల్లే ఐఏఎస్ అధికారుల సర్వీసు నిబంధనల్లో మార్పులను ప్రతిపాదించాల్సి వచ్చిందని కేంద్ర సిబ్బంది వ్యవహారాలు,శిక్షణ విభాగం వర్గాలు తెలిపాయి. రాష్ట్రాల వైఖరి కేంద్ర ప్రభుత్వ పాలనా వ్యవహారాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొన్నాయి. కేంద్రంలో సంయుక్త కార్యదర్శి స్థాయి ఐఏఎస్ అధికారుల ప్రాతినిధ్యం తగ్గిపోతోందని, సెంట్రల్ డిప్యుటేషన్ రిజర్వు(సీడీఆర్)కు తమ వంతు అధికారులను చాలా రాష్ట్రాలు కేటాయించడంలేదని ఆ వర్గాలు ఆక్షేపించాయి. రాష్ట్ర కేడర్ నుంచి వచ్చి కేంద్రంలో పనిచేసే అధికారుల సంఖ్య తగ్గిపోవడంతో ఐఏఎస్ కేడర్ రూల్స్-1954కు మార్పులు చేయాల్సి వచ్చిందని వివరించాయి. దీనివల్ల ఏ అధికారినైనా డిప్యుటేషన్‌పై కేంద్రానికి పంపించాలన్న అభ్యర్థనను తోసిపుచ్చే అధికారం ఇక రాష్ట్రాలకు ఉండదు. ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రధానికి ఇప్పటికి రెండుసార్లు లేఖ రాశారు. మరికొన్ని రాష్ట్రాల నుంచీ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సమాచారం ప్రకారం.. సెంట్రల్ డిప్యుటేషన్ రిజర్వు(సీడీఆర్)కు 2011లో 309 మంది ఐఏఎస్‌లను కేటాయిస్తే...ప్రస్తుతం ఆ సంఖ్య 223కు తగ్గిపోయింది. డిప్యూటీ కార్యదర్శి/డైరెక్టర్ స్థాయి ఐఏఎస్‌ల సంఖ్య 2014లో 621 మంది ఉండగా 2021లో ఆ సంఖ్య 1,130కి పెరిగింది. అదే సమయంలో సీడీఆర్‌కు పంపిస్తున్న ఆ స్థాయి అధికారుల సంఖ్య 117 నుంచి 114కు తగ్గిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ అవసరాలకు తగినంత మంది ఐఏఎస్‌లు అందుబాటులో ఉండడంలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వివరించాయి. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలుచేయడం, తాజా సమాచారాన్ని పొందడం వంటి అంశాల్లో అనుభవజ్ఞులైన ఈ స్థాయి అధికారుల కొరత కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉంటోందని తెలిపాయి. రాష్ట్రాల నుంచి కేంద్రానికి, కేంద్రం నుంచి రాష్ట్రానికి పరస్పరం సిబ్బంది మార్పిడి జరగడం ప్రభుత్వాలకే కాకుండా అధికారులు వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నాయి. ఐఏఎస్ కేడర్ రూల్స్ మార్పు ప్రతిపాదనలపై అభిప్రాయాలు తెలపాలని కోరుతూ గత ఏడాది డిసెంబరు 20, 27, ఈ ఏడాది జనవరి 6,12 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు కేంద్రం లేఖలు రాసింది. ఈ నెల 25వ తేదీలోగా రాష్ట్రాలు అభ్యంతరాలు తెలపాల్సి ఉంటుంది.