యుద్ధస్మారకంలో అమర జ్యోతి విలీనం

దేశ రాజధాని దిల్లీలోని ‘ఇండియా గేట్‌’ వద్ద 50 ఏళ్లుగా ఏకధాటిగా వెలిగిన అమర జవాన్‌ జ్యోతి.. జాతీయ యుద్ధస్మారకం వద్ద ఉన్న జ్వాలలో కలిసిపోయింది. నిర్వహణ కష్టతరం కావడం వల్ల వీటిని కలపాలనే

Published : 22 Jan 2022 05:18 IST

విలీన కార్యక్రమం పూర్తి

ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్‌ విమర్శలు

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని ‘ఇండియా గేట్‌’ వద్ద 50 ఏళ్లుగా ఏకధాటిగా వెలిగిన అమర జవాన్‌ జ్యోతి.. జాతీయ యుద్ధస్మారకం వద్ద ఉన్న జ్వాలలో కలిసిపోయింది. నిర్వహణ కష్టతరం కావడం వల్ల వీటిని కలపాలనే నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అమర్‌ జవాన్‌ జ్యోతిని ఇక నిలిపివేస్తామని, ప్రజలు జాతీయ యుద్ధ స్మారకం వద్ద  వీర సైనికులకు నివాళులర్పించాలని కోరాయి. ఇంటిగ్రేటెడ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ అధిపతి ఎయిర్‌ మార్షల్‌ బలభద్ర రాధాకృష్ణ సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో అమర జవాను జ్యోతిని.. 400 మీటర్ల దూరంలోని జాతీయ యుద్ధ స్మారకంలో కలిపారు.
1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో అసువులుబాసిన సైనికులకు గుర్తుగా అమర జవాను జ్యోతిని ఏర్పాటు చేశారు. 1972 జనవరి 26న నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దీన్ని ఆవిష్కరించారు. జాతీయ యుద్ధస్మారకాన్ని 2019 ఫిబ్రవరి 25న ప్రధాని మోదీ ప్రారంభించారు. దేశ రక్షణలో ప్రాణాలర్పించిన 25,942 మంది సైనికుల పేర్లను ఇక్కడి గ్రానైట్‌ ఫలకాలపై బంగారు అక్షరాల్లో చెక్కారు.

జ్యోతి విలీనంపై మాజీ సైనికుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ప్రభుత్వ నిర్ణయాన్ని మాజీ సైన్యాధ్యక్షుడు వేద్‌ ప్రకాశ్‌ మాలిక్‌ సమర్థించారు. జాతీయ యుద్ధ స్మారకం ఏర్పాటయ్యాక అమర జవాన్లకు నివాళులర్పించే కార్యక్రమాలన్నీ అక్కడే జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో రెండు జ్యోతులను విలీనం చేయడం సబబేనన్నారు. వైమానిక దళ మాజీ ఉన్నతాధికారి మన్మోహన్‌ బహదూర్‌ మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఇండియా గేట్‌ వద్ద అమరజ్యోతి.. భారతీయుల మనస్సులో బలమైన ముద్ర వేసిందన్నారు. విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మోదీని కోరారు. జాతీయ యుద్ధ స్మారకం గొప్పదే అయినా.. అమర్‌జవాన్‌ జ్యోతితో ముడిపడిన జ్ఞాపకాలు మాత్రం చెరిగిపోవన్నారు. జవాన్ల కోసం జాతీయ యుద్ధ స్మారకం నిర్మించినందున ఇండియా గేట్‌ వద్ద ప్రత్యేక జ్యోతి ఎందుకన్న వాదన ఉన్నట్లు సైనికవర్గాలు పేర్కొన్నాయి. 1947-48 పాకిస్థాన్‌ యుద్ధం మొదలుకొని గల్వాన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరులైన సైనికుల వరకు అందరి పేర్లు జాతీయ యుద్ధ స్మారకంలో ఉన్నాయని గుర్తుచేశాయి.

ఆర్పడం కాదు.. విలీనమే..: ప్రభుత్వం

అమర్‌జవాన్‌ జ్యోతిని ఆర్పేయడం లేదని, జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఉన్న జ్యోతితో కలిపేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు స్పష్టంచేశాయి. ‘‘ఇండియా గేట్‌ మీద ముద్రించిన జవాన్ల పేర్లలో 1971 యుద్ధంలో మరణించిన వారి పేర్లు లేవు. మొదటి ప్రపంచ యుద్ధం, అఫ్గాన్‌-ఆంగ్లో యుద్ధంలో పోరాడిన అమరుల పేర్లే ఉన్నాయి. ఇది వలస పాలనను గుర్తుకు తెస్తోంది. జాతీయ యుద్ధ స్మారకంలో భారతీయ అమరవీరులందరి పేర్లు ఉంటాయి. అందువల్ల అమర జవాన్ల కోసం జ్యోతిని అక్కడ ఏర్పాటు చేయడమే సబబు. ఏడు దశాబ్దాల్లో జాతీయ యుద్ధ స్మారకాన్ని నిర్మించలేని వాళ్లు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు’’ అని విమర్శించాయి.

దేశభక్తి, త్యాగాలు వారికి అర్థంకావు: రాహుల్‌ గాంధీ

ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్‌ మండిపడింది. కొందరు దేశభక్తిని, త్యాగాన్ని అర్థం చేసుకోలేరంటూ ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ.. భాజపాపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. శౌర్యపరాక్రమాలు చాటిన జవాన్ల స్మారకార్థం వెలిగిన జ్యోతి ఈ రోజు లేకపోవడం విచారకరమని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక అమర్‌ జవాన్‌ జ్యోతిని మళ్లీ వెలిగిస్తామని స్పష్టంచేశారు. ఆ జ్యోతిని ఆర్పడమంటే చరిత్రను తుడిచేయడమేనని కాంగ్రెస్‌ నేత మనీశ్‌ తివారి వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని