అమల్లోకి ‘పర్యావరణ ర్యాంకింగ్‌’ విధానం

ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల మంజూరు విషయంలో రాష్ట్రాల పర్యావరణ ప్రభావ మధింపు ప్రాధికార సంస్థ (ఎస్‌ఈఐఏఏ)లకు ర్యాంకింగ్‌ ఇచ్చే కొత్త వ్యవస్థను కేంద్రం సోమవారం ప్రవేశపెట్టింది. నిబంధనలను నీరు గార్చకుండా ఈ

Updated : 25 Jan 2022 06:01 IST

ఈనాడు, దిల్లీ: ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల మంజూరు విషయంలో రాష్ట్రాల పర్యావరణ ప్రభావ మధింపు ప్రాధికార సంస్థ (ఎస్‌ఈఐఏఏ)లకు ర్యాంకింగ్‌ ఇచ్చే కొత్త వ్యవస్థను కేంద్రం సోమవారం ప్రవేశపెట్టింది. నిబంధనలను నీరు గార్చకుండా ఈ సంస్థల్లో సమర్థత, పారదర్శకత, జవాబుదారీతనాన్ని ప్రోది చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ తెలిపింది. 2006 నాటి పర్యావరణ ప్రభావ మదింపు (ఈఐఏ) నోటిఫికేషన్‌లోని అంశాలు, మంత్రిత్వశాఖ ఎప్పటికప్పుడు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ విధానాన్ని రూపొందించారు. అయితే ర్యాంకింగ్‌ ప్రక్రియను అందుకోకుంటే నెగెటివ్‌ మార్కులు ఉండబోవు. మొత్తంమీద ఎస్‌ఈఐఏఏలకు ర్యాంకింగ్‌ ఇవ్వడానికి ఏడు అంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు. ఇందులో పర్యావరణ అనుమతి (ఈసీ) జారీ చేయడానికి సరాసరిన ఎన్ని రోజులు పడుతోందన్న అంశం కూడా ఉంది. 105 రోజుల్లో ఈసీ మంజూరు చేయాలని ఈఐఏ నోటిఫికేషన్‌ సూచిస్తోంది. అందులో మదింపు ప్రక్రియలో 60 రోజులు, ప్రాధికార సంస్థ నిర్ణయం తీసుకోవడానికి 45 రోజుల సమయాన్ని నిర్దేశించింది. కొత్త ర్యాంకింగ్‌ విధానంలో.. ఎస్‌ఈఐఏఏలు నిర్ణయం తీసుకోవడానికి 120 కన్నా ఎక్కువ రోజులు తీసుకున్నా మార్కులు తగ్గించరు. 80-105 రోజుల్లో నిర్ణయం తీసుకుంటే అదనంగా ఒక మార్కు లభిస్తుంది. 105 నుంచి 120 రోజుల మధ్య నిర్ణయం తీసుకుంటే అర మార్కు ఇస్తారు. పెండింగ్‌లో ఉన్న విధి విధానాల (టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌) ప్రతిపాదనల పరిష్కారం అంశం వంటి వాటినీ పరిగణనలోకి తీసుకోనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని