‘విదేశీ విరాళాల అనుమతులపై’ కె.ఎ.పాల్‌ వినతిని తిరస్కరించిన సుప్రీంకోర్టు

విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) పరిధిలోని లైసెన్సులను కొనసాగిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలన్న గ్లోబల్‌ పీస్‌ ఇనిషియేటివ్‌ సంస్థ వ్యవస్థాపకుడు కె.ఎ.పాల్‌ విజ్ఞప్తిని

Published : 26 Jan 2022 05:02 IST

ఈనాడు, దిల్లీ: విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) పరిధిలోని లైసెన్సులను కొనసాగిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలన్న గ్లోబల్‌ పీస్‌ ఇనిషియేటివ్‌ సంస్థ వ్యవస్థాపకుడు కె.ఎ.పాల్‌ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ అంశంపై ఏవైనా సూచనలు ఉంటే పిటిషనర్‌ సంబంధిత అధికారులను సంప్రదించాలని, అవి సమంజసంగా ఉంటే అధికారులు పరిగణలోకి తీసుకోవాలని జస్టిస్‌ ఎ.ఎం.ఖన్విల్కర్‌, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ‘‘2021 సెప్టెంబరు 30వ తేదీ వరకు ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతులు ఉన్న సంస్థలన్నింటికీ తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకూ లైసెన్సులు పొడిగిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని పిటిషనర్‌ కోరారు. గడువు తేదీ లోగా లైసెన్సుల పునరుద్ధరణ కోసం 11,594 స్వచ్ఛంద సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయని, వాటి రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం పొడిగించిందని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తెలిపారు. అధికారులు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అనుకోవడంలేదు. ఒకవేళ పిటిషనర్లకు ఏవైనా అభ్యంతరాలుంటే అధికారులకు వినతిపత్రం సమర్పించుకోవచ్చు’’ అని ధర్మాసనం మంగళవారం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. విపత్తు నిర్వహణ చట్టం కింద కొవిడ్‌ను ‘నోటిఫైడ్‌ డిజాస్టర్‌’గా ప్రకటించినందున ఎఫ్‌సీఆర్‌ఏ చట్టం నుంచి అన్ని స్వచ్ఛంద సేవా సంస్థలకు మినహాయింపునిస్తూ, ప్రస్తుతం ఉన్న లైసెన్సులను తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు కొనసాగించాలని ‘గ్లోబల్‌ పీస్‌ ఇనిషియేటివ్‌’ సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని