వ్యక్తి గౌరవాన్ని కాపాడటమే మా లక్ష్యం

వ్యక్తుల హోదాను పెంచటం, ప్రతి ఒక్కరి గౌరవాన్ని కాపాడటమే మా లక్ష్యమని మహీంద్ర సంస్థ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌ చేశారు. గతవారం కర్ణాటకలోని తుమకూరులో

Published : 26 Jan 2022 05:02 IST

కన్నడ రైతుకు అవమానంపై ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు : వ్యక్తుల హోదాను పెంచటం, ప్రతి ఒక్కరి గౌరవాన్ని కాపాడటమే మా లక్ష్యమని మహీంద్ర సంస్థ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌ చేశారు. గతవారం కర్ణాటకలోని తుమకూరులో మహీంద్ర షోరూం సిబ్బంది ఓ రైతును అవమానపరిచిన సంఘటన జాతీయ స్థాయిలో వైరల్‌గా మారింది. ఈ సంఘటనపై మంగళవారం మరోమారు ట్వీట్‌ చేసిన ఆనంద్‌ మహీంద్ర తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘అన్ని సముదాయాలను, కొనుగోలుదారులను ప్రోత్సహించి వారిని అభివృద్ధి పరచటం సంస్థ ప్రధాన ధ్యేయం. ఈ విధానాలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవు. తక్షణమే ఈ సంఘటనపై సమగ్రంగా విచారిస్తాం’ అని ప్రకటించారు. ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌ను ట్యాగ్‌ చేసిన కంపెనీ సీఈఓ(ఆటోమోటివ్‌ డివిజన్‌) విజయ్‌ నక్రా కూడా సంస్థ వినియోగదారులను గౌరవించడం డీలర్ల కనీస బాధ్యతగా వివరించారు. తుమకూరుకు చెందిన కెంపేగౌడ అనే రైతు బొలెరో ఎస్‌యూవీ ట్రక్‌ను కొనుగోలు చేసేందుకు మహీంద్ర షోరూంకు వెళ్లగా ‘నీ దగ్గర డబ్బులెక్కడివి?’ అంటూ అక్కడి సిబ్బంది అవమానపరిచిన విషయంతెలిసిందే. అర్ధగంటలో రూ.10లక్షలు తెస్తా.. వాహనం ఇస్తారా? అంటూ సవాలు విసిరిన ఆ రైతు 25 నిమిషాల్లోనే అంత డబ్బు తెచ్చాడు. వాహనం సిద్ధంగా లేదంటూ చెప్పిన సిబ్బందిపై ఆరైతు పోలీసులకు ఫిర్యాదు చేయడం వైరల్‌గా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని