
ఉద్యానవనానికి టిప్పు సుల్తాన్ పేరుపై రగడ
ముంబయిలో అధికార, ప్రతిపక్షాల విమర్శలు
ముంబయి: ఆధునీకరించిన ఓ ఉద్యానవనానికి టిప్పు సుల్తాన్ పేరు పెట్టడంపై మహారాష్ట్రలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. టిప్పు సుల్తాన్.. హిందువులను హింసించారని, ఆయన పేరు ప్రజాప్రయోజనాలకు ఉద్దేశించిన ప్రాంతాలకు పెట్టడం తగదంటూ భాజపా బుధవారం ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. భాజపా చరిత్రను వక్రీకరిస్తూ, ప్రజల్ని రెచ్చగొడుతోందని అధికార కాంగ్రెస్, ఎన్‌సీపీలు గురువారం విరుచుకుపడ్డాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 2017లో కర్ణాటక అసెంబ్లీలో చేసిన ప్రసంగంలో టిప్పు సుల్తాన్ పాలనను కొనియాడారని గుర్తుచేశాయి. కొల్లూరులోని మూకాంబికా ఆలయంలో రోజూ సాయంత్రం టిప్పు సుల్తాన్, నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ల పేరిట హారతి కార్యక్రమం కొనసాగుతోందని కాంగ్రెస్ నేత సచిన్ సావత్ తెలిపారు. బ్రిటిష్ వారిని ఎదిరించిన ధీశాలిగా టిప్పు సుల్తాన్ ప్రసిద్ధుడని, అందుకే ఆయన చిహ్నాన్ని (మైసూర్ పులి) నేతాజీ తన ఆజాద్ హింద్ సేన పతాకంలో చేర్చారన్నారు. ఉద్యానవనానికి టిప్పుసుల్తాన్ పేరు పెట్టాలని గతంలో భాజపా కార్పొరేటర్లే లేఖలు ఇచ్చారని, ఆ విషయాలన్నీ మరచి ప్రజల దృష్టి మళ్లించేందుకే భాజపా రాజకీయం చేస్తోందని ఎన్‌సీపీ నేత, కేబినెట్ మంత్రి నవాబ్ మాలిక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisement