ఇక బహిరంగ విపణిలో కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌

కొవిడ్‌-19 టీకాలు కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ ఇక బహిరంగ విపణిలోనూ అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ

Published : 28 Jan 2022 04:27 IST

అనుమతి మంజూరు చేసిన డీజీసీఏ
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ప్రకటన

దిల్లీ: కొవిడ్‌-19 టీకాలు కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ ఇక బహిరంగ విపణిలోనూ అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ గురువారం తెలిపారు. ఇప్పటివరకు ఈ టీకాలకు దేశంలో అత్యవసర వినియోగ అనుమతులు మాత్రమే ఉన్నాయి. బహిరంగ విపణి అనుమతితో దేశవ్యాప్తంగా ప్రయివేట్‌ ఆసుపత్రుల్లో ప్రస్తుత ధరలు కంటే తక్కువకు లభ్యం కానున్నాయి. ధరను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే జాతీయ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ (ఎన్‌పీపీఏ) వర్గాలు ఈ టీకాల ఒక్కో డోసు ధర రూ.275 ఉండే అవకాశం ఉందని.. సర్వీసు ఛార్జీల కింద అదనంగా మరో రూ.150 వసూలు చేసే అవకాశం ఉందని చెబుతున్నాయి.  బహిరంగ విపణి అనుమతి లభించినా, ప్రభుత్వ టీకా కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని మంత్రి మాండవీయ పేర్కొన్నారు. భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌, సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన కొవిషీల్డ్‌కు గతేడాది జనవరి 3న అత్యవసర వినియోగ అనుమతులు లభించాయి. అయితే బహిరంగ విపణి అనుమతి కోసం ఇటీవల సీరం, భారత్‌ బయోటెక్‌.. డీసీజీఐకు దరఖాస్తు చేసుకున్నాయి. దీనిపై ఈనెల 19న కేంద్ర ఔషధ ప్రమాణ నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీఓ)లోని కొవిడ్‌-19 నిపుణుల కమిటీ సానుకూలంగా స్పందించింది. దీంతో న్యూ డ్రగ్స్‌ అండ్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ రూల్స్‌- 2019 కింద షరతులతో కూడిన బహిరంగ విపణి అనుమతులను డీజీసీఐ మంజూరు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని