బిహార్‌లో బంద్‌

రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు సాంకేతికేతర ప్రాచుర్య విభాగాల (ఆర్‌ఆర్‌బీ-ఎన్‌టీపీసీ) నియామక పరీక్షల ప్రక్రియను వ్యతిరేకిస్తూ బిహార్‌లో విద్యార్థి సంఘాలు శుక్రవారం పెద్దఎత్తున బంద్‌ చేపట్టాయి. ఎక్కడికక్కడ ప్రధాన

Updated : 29 Jan 2022 04:26 IST

రహదారుల దిగ్బంధం

ఆర్‌ఆర్‌బీ పరీక్షల ప్రక్రియను నిరసిస్తూ ఆందోళనలు

పట్నా/దిల్లీ: రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు సాంకేతికేతర ప్రాచుర్య విభాగాల (ఆర్‌ఆర్‌బీ-ఎన్‌టీపీసీ) నియామక పరీక్షల ప్రక్రియను వ్యతిరేకిస్తూ బిహార్‌లో విద్యార్థి సంఘాలు శుక్రవారం పెద్దఎత్తున బంద్‌ చేపట్టాయి. ఎక్కడికక్కడ ప్రధాన రహదారులపై టైర్లను తగలబెట్టి ట్రాఫిక్‌ను నిలిపివేశారు. పట్నా  నగరం నడిబొడ్డున ఉన్న డాక్‌ బంగ్లా క్రాసింగ్‌ వద్ద పెద్దఎత్తున ప్రదర్శన చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, ఆర్‌ఆర్‌బీ తమ డిమాండ్లు నెరవేర్చాలని నినాదాలు చేశారు. ఆందోళనకారులు రాజ్‌భవన్‌వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో వారితో ఘర్షణకు దిగారు. బంద్‌ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా జనజీవనానికి ఆటంకం కలిగింది. బక్సర్‌, జహానాబాద్‌, బాగల్‌పుర్‌, కతిహార్‌, బేగుసరై, ముంజెర్‌ తదితర ప్రాంతాల్లో ప్రతిపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్‌, వామపక్షాలు ఇతర పార్టీల నేతలు ఆందోళనకు మద్దతిచ్చారు. ఎన్‌డీఏ నేతలు జితన్‌రామ్‌ మాంఝీ, ముకేశ్‌ సాహనీ కూడా బంద్‌కు నైతిక మద్దతు ప్రకటించారు. పలుచోట్ల అధికార కూటమికి చెందిన భాజపా, జేడీయూ పార్టీల నేతలు కూడా సానుభూతి తెలిపారు. ఉద్యోగార్థుల ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధానమంత్రి కార్యాలయం రైల్వే అధికారులతో భేటీ అవుతున్నట్లు తెలుస్తోంది. కాగా రైల్వే నియామక పరీక్షలపై అభ్యర్థుల్లో తలెత్తుతున్న ఆందోళనలను గుర్తించి, వారి సమస్యలను పరిష్కారించాలని కేంద్ర మాజీ మంత్రి, భాజపా నేత, పట్నా ఎంపీ రవిశంకర్‌ ప్రసాద్‌.. రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ను కోరారు. భవిష్యత్తులో ఇలాంటి నిరసనలు తలెత్తకుండా మార్గసూచిని రూపొందించాలన్నారు. ఈమేరకు ఓ కమిటీని ఏర్పాటు చేశామని, త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని రైల్వే మంత్రి చెప్పినట్లు రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు.

ఉద్యోగార్థుల ఆందోళన ఉత్తర్‌ప్రదేశ్‌కు కూడా పాకడంతో ఎన్నికలు జరుగుతున్న ఆ రాష్ట్రంలో భాజపా పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన బిహార్‌ భాజపా నేతలు విద్యార్థులను ఊరడించే ప్రయత్నం చేశారు. మోదీ ప్రభుత్వంపై విశ్వాసం ఉంచాలని, ఆర్జేడీ నేతృత్వంలోని ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దని బిహార్‌ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సంజయ్‌ జైశ్వాల్‌ విద్యార్థులను కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని