
ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్ల నిర్ణయం రాష్ట్రాలదే
సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ
దిల్లీ:ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను నిర్ధరించడంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. నిర్దిష్ట ప్రమాణాల రూపకల్పననూ చేయబోమని స్పష్టం చేసింది. శాఖల వారీగా, వాస్తవ గణాంకాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలే పదోన్నతుల రిజర్వేషన్ల అంశంలో నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ ధర్మాసనంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బి.ఆర్.గవయ్ సభ్యులుగా ఉన్నారు.
పదోన్నతుల్లో రిజర్వేషన్లకు కేడర్, సర్వీస్ కాలం, ఉద్యోగుల ప్రాతినిధ్య నిష్పత్తితో పాటు శాఖల వారీగా గణాంకాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం తెలిపింది. ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రానికి మధ్య స్థానిక పరిస్థితులు, అవసరాలు భిన్నంగా ఉంటాయి కనుక దేశమంతటికీ ఏకరూప విధానం సరికాదని పేర్కొంది. ఆయా రాష్ట్రాలే నిర్ణీత కాలవ్యవధుల్లో సమాచారాన్ని సేకరించటంతో పాటు సహేతుకంగా సమీక్షించి తదనుగుణమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది. సమూహంగా కాకుండా కేడర్ వారీగా రోస్టర్లను సిద్ధం చేయాలని తెలిపింది.
ప్రస్తుత కేసులో అన్ని పక్షాల వాదనలను విన్న తర్వాత నిర్దిష్ట ప్రమాణాల తయారీ ఆవశ్యకత కూడా ఒకటని గుర్తించినట్లు తెలిపింది. జర్నైల్ సింగ్ నాగరాజ్ కేసు నేపథ్యంలో ఆ ప్రమాణాల తయారీలో జోక్యం చేసుకోలేమని, సంబంధిత గణాంకాల సేకరణ, కొలమానాల ఖరారు బాధ్యత రాష్ట్రాలదేనని పేర్కొంది. గతేడాది అక్టోబర్ 26న తీర్పును రిజర్వులో ఉంచిన ధర్మాసనం శుక్రవారం దానిని వెలువరించింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ,ఎస్టీలకు పదోన్నతులకు నిర్దిష్టమైన ఒక విధానం ఖరారు చేయాలని సుప్రీంకోర్టును గతంలో కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కేంద్రం తరఫున వాదించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్.. ఏళ్లుగా ఎస్సీ, ఎస్టీలు ప్రధాన స్రవంతి నుంచి దూరంగా ఉన్నారని, వారికి సమాన అవకాశాలు కల్పించేందుకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తరువాత కూడా ఎస్సీ, ఎస్టీలను ప్రతిభలో ఉన్నత వర్గాలతో సమాన స్థాయికి తీసుకురాలేకపోయామని పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.