హిజాబ్‌ వివాదానికి రాజకీయ రంగు

కర్ణాటకలోని కొన్ని కళాశాలల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్‌ ధరించి తరగతులకు హాజరు కావడంపై జనవరి చివరి వారంలో ప్రారంభమైన వివాదం చినికి చినికి గాలివానలా మారింది. ఈ వివాదం విద్యాసంస్థలను

Published : 07 Feb 2022 04:09 IST

 కర్ణాటకలో అధికార, ప్రతిపక్ష నేతల విమర్శలు

బెంగళూరు, న్యూస్‌టుడే: కర్ణాటకలోని కొన్ని కళాశాలల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్‌ ధరించి తరగతులకు హాజరు కావడంపై జనవరి చివరి వారంలో ప్రారంభమైన వివాదం చినికి చినికి గాలివానలా మారింది. ఈ వివాదం విద్యాసంస్థలను దాటి, రాజకీయ నాయకుల గోదాలో బంతిలా మారిపోయింది. విద్యార్థులకు ఏకరూప వస్త్రాల నిబంధన లేకుండా చూడాలని పీయూ బోర్డు డైరెక్టర్‌, ఐఏఎస్‌ అధికారిణి స్నేహల్‌ సర్క్యులర్‌ జారీ చేసిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వం ఆమెకు ఏ పోస్టూ కేటాయించకుండా, బదిలీ ఆదేశాలిచ్చింది. హిజాబ్‌ వివాదం నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శలు చేశారు. ముస్లిం విద్యార్థినులు చదువుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం కుట్రకు తెరతీసిందని ఆరోపించారు. రాహుల్‌ వ్యాఖ్యలను కర్ణాటక భాజపా శాఖ ఖండించింది. విద్యలోనూ మతాన్ని చొప్పించేందుకు ఆయన ప్రయత్నించడం భారతదేశ భవిష్యత్తుకు ప్రమాదకరమని భాజపా నాయకులు మండిపడ్డారు. ‘సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో షాదీ భాగ్య, టిప్పు జయంతి వేడుకలు నిర్వహించి సమాజంలో మరిన్ని చీలికలకు కారకులయ్యార’ని రెవెన్యూ మంత్రి ఆర్‌.అశోక్‌ వ్యాఖ్యలు చేశారు. విద్యా సంస్థల్లº కులం, మత అంశాలు ప్రత్యేకంగా కనిపించకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కాషాయ కండువా లేదా హిజాబ్‌ను ధరించేందుకు తాము అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు. తాము హిజాబ్‌ ధరించి వస్తే తరగతి గదులకు రానీయడం లేదంటూ ఆరుగురు విద్యార్థినులు కర్ణాటక ఉన్నత న్యాయస్థానంలో వేసిన వ్యాజ్యం మంగళవారం విచారణకు రానుంది. రాష్ట్రవ్యాప్తంగా కొందరు విద్యార్థులు హిజాబ్‌కు మద్దతు ప్రకటించగా, ఉడుపి, కుందాపుర, మంగళూరు, బైందూరు తదితర ప్రాంతాల్లో వ్యతిరేకత వ్యక్తమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని