10 rupee coin: రూ.10 నాణేలు చెల్లుబాటులో ఉన్నాయి

దేశంలో రూ.10 నాణేలు చెల్లుబాటులో ఉన్నాయని, వాటిని ఆర్‌బీఐ ముద్రించి చెలామణిలో ఉంచిందని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌదరి వెల్లడించారు. రూ.10 నాణేలు నకిలీవన్న ఉద్దేశంతో దేశంలో చెల్లుబాటు కావడంలేదా? వాటి చెల్లుబాటు కోసం కేంద్రం ఏమైనా

Updated : 09 Feb 2022 06:56 IST

 ఇవి ఆర్‌బీఐ జారీ చేసినవే... నకిలీవి కావు  

రాజ్యసభలో స్పష్టంచేసిన కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి

ఈనాడు, దిల్లీ: దేశంలో రూ.10 నాణేలు చెల్లుబాటులో ఉన్నాయని, వాటిని ఆర్‌బీఐ ముద్రించి చెలామణిలో ఉంచిందని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌదరి వెల్లడించారు. రూ.10 నాణేలు నకిలీవన్న ఉద్దేశంతో దేశంలో చెల్లుబాటు కావడంలేదా? వాటి చెల్లుబాటు కోసం కేంద్రం ఏమైనా చర్యలు తీసుకుంటోందా? అని తమిళనాడుకు చెందిన ఏఐఏడీఎంకే సభ్యుడు ఎ.విజయకుమార్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. ‘‘కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఆర్‌బీఐ రూ.10 నాణేలు వివిధ సైజులు, ఇతివృత్తాలు, డిజైన్లలో ముద్రిస్తోంది. అవన్నీ చెల్లుబాటులో ఉన్నాయి. అన్నిరకాల లావాదేవీలకు వాటిని వాడుకోవచ్చు. అయితే రూ.10 నాణేలను తీసుకోవడంలేదని సాధారణ ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. అందువల్ల వారిలో అవగాహన కల్పించడానికి, ప్రజల్లో ఉన్న అపోహలు, అనుమానాలను నివృత్తి చేయడానికి ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు పత్రికా ప్రకటనలు విడుదల చేస్తోంది. ఎలాంటి అనుమానం లేకుండా అన్ని లావాదేవీల్లో పది రూపాయల నాణేలను తీసుకోవచ్చని ప్రజలకు చెబుతూ వస్తోంది. దేశవ్యాప్తంగా దీనిపై ఎస్‌ఎంఎస్‌ అవగాహన ఉద్యమం నిర్వహిస్తోంది. అయితే రూ.10 నాణేలు తీసుకోవడంలేదన్న కారణంతో కేసులు దాఖలైన అంశం మా దృష్టికేమీ రాలేదు’’ అని కేంద్రమంత్రి వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని