ఫేస్‌బుక్‌ లైవ్‌లో విషం తాగిన పాదరక్షల వ్యాపారి దంపతులు

తమ ఆర్థిక దుస్థితికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే కారణమని ఆరోపిస్తూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాగ్‌పత్‌కు చెందిన పాదరక్షల (బూట్లు) వ్యాపారి, ఆయన భార్య ఫేస్‌బుక్‌ లైవ్‌లో విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు.

Updated : 10 Feb 2022 07:17 IST

భార్య మృతి, భర్త పరిస్థితి విషమం

తమ ఆర్థిక దుస్థితికి ప్రధానమంత్రే కారణమని ఆరోపణ

బాగ్‌పత్‌: తమ ఆర్థిక దుస్థితికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే కారణమని ఆరోపిస్తూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాగ్‌పత్‌కు చెందిన పాదరక్షల (బూట్లు) వ్యాపారి, ఆయన భార్య ఫేస్‌బుక్‌ లైవ్‌లో విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ ఘటనలో వ్యాపారి పరిస్థితి ఆందోళనకరంగా ఉండగా, ఆయన భార్య మరణించారు. నోట్ల రద్దు, జీఎస్టీ వల్లే తాను అప్పుల పాలైనట్లు సుభాష్‌నగర్‌లో ఉండే రాజీవ్‌ తోమర్‌ (40) విషం తాగే ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నా మరణానికి కారణం ప్రధాని మోదీయే అవుతారు. ఆయనకు చేతనైతే పరిస్థితులను చక్కదిద్దాలి. ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయాన్నీ తప్పుబట్టడం లేదు. రైతులు, చిన్న వ్యాపారులకు ఆయన హితుడు కాదు’’ అని వీడియోలో పేర్కొన్నారు. రాజీవ్‌ విషం తీసుకుంటుండగా అతడి భార్య పూనం అడ్డుకున్నారు. వద్దని వారించారు. దీంతో భావోద్వేగానికి లోనైన రాజీవ్‌.. ‘‘ప్రభుత్వం మన మాట వినడం లేదు. కనీసం నువ్వయినా విను’’ అంటూ విషం తాగేశారు.  దీంతో పూనం కూడా విషం తాగారు. అనంతరం ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే పూనం మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. రాజీవ్‌ పరిస్థితి విషమంగా ఉందని ఎస్పీ నీరజ్‌ కుమార్‌ జాదౌన్‌ తెలిపారు. 2020లో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా రాజీవ్‌ వ్యాపారం దారుణంగా దెబ్బతిందని, అతని దుకాణంలోని బూట్లలో చాలా మటుకు పాడైపోయాయని కుటుంబసభ్యులు తెలిపారు. ఫలితంగా తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేక పోయాడని వివరించారు. రాజీవ్‌కు ఇద్దరు కుమారులు ఉన్నట్లు చెప్పారు. రాజీవ్‌ భార్య మృతిపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా విచారం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని