తృణమూల్‌ జాతీయ ‘ఆఫీస్‌ బేరర్ల’ కమిటీ రద్దు

తృణమూల్‌ కాంగ్రెస్‌ జాతీయ ఆఫీస్‌ బేరర్ల కమిటీని ఆ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ శనివారం రద్దు చేశారు. పార్టీలో విభేదాలను పరిష్కరించడమే లక్ష్యంగా 20 మంది సభ్యులతో కొత్తగా కార్యనిర్వాహక కమిటీని

Published : 13 Feb 2022 04:46 IST

కొత్తగా కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటుచేసిన మమత

కోల్‌కతా: తృణమూల్‌ కాంగ్రెస్‌ జాతీయ ఆఫీస్‌ బేరర్ల కమిటీని ఆ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ శనివారం రద్దు చేశారు. పార్టీలో విభేదాలను పరిష్కరించడమే లక్ష్యంగా 20 మంది సభ్యులతో కొత్తగా కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటుచేశారు. రద్దైన కమిటీలో పార్టీ జాతీయ కార్యదర్శి, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ సభ్యుడుగా ఉండడం విశేషం. పార్టీపై తనకున్న నియంత్రణను ప్రతిబింబిస్తూ అధ్యక్షురాలు సీనియర్‌ నేతలతో కార్యనిర్వాహక కమిటీని నింపేశారు. పార్టీలోని పెద్దలకు, నూతన తరానికి మధ్య విభేదాలు నెలకొన్నప్పటికీ ఆమె సీనియర్లవైపే మొగ్గు చూపడం విశేషం. టీఎంసీలోని సీనియర్లు పార్టీ, ప్రభుత్వంలో ఒకటి కంటే ఎక్కువ పదవులు నిర్వహిస్తుండడంపై అభిషేక్‌ బెనర్జీ మద్దతున్న కొత్త తరం నేతలు విమర్శిస్తున్నారు. మరోవైపు, మమత త్వరలోనే కొత్త ఆఫీస్‌ బేరర్ల కమిటీని ప్రకటిస్తారని కాళీఘాట్‌లో సీఎం నివాసంలో ఆమెతో భేటీ అనంతరం టీఎంసీ నేత పార్థా ఛటర్జీ చెప్పారు. ‘‘జాతీయ ఆఫీస్‌ బేరర్ల కమిటీలోని పదవులన్నీ రద్దయ్యాయి. ఆ కమిటీ విషయమై పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ త్వరలో నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం పార్టీలో ఆమె ఒక్కరే నాయకురాలు’’ అని వెల్లడించారు.  గతేడాది శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం అనంతరం అభిషేక్‌ బెనర్జీకి పార్టీలో ప్రాభవం పెరిగినప్పటికీ.. సమావేశంలో పాల్గొన్న కొందరు నాయకులు తమ ‘సుప్రీం నాయకురాలు’ మమతా బెనర్జీయేనని పునరుద్ఘాటించినట్లు సమాచారం. పార్టీ నాయకులు అమిత్‌ మిత్రా, పార్థా ఛటర్జీ, సుబ్రతా బక్షీ, సుదీప్‌ బందోపాధ్యాయ, అభిషేక్‌ బెనర్జీ, అనుబ్రత మొండల్‌, అరూప్‌ బిశ్వాస్‌, ఫిర్హాద్‌ హకీమ్‌, యశ్వంత్‌ సిన్హా తదితరులకు కొత్త కార్యనిర్వాహక కమిటీలో స్థానం లభించింది. రాజ్యసభలో టీఎంసీ నేత డెరెక్‌ ఓబ్రియెన్‌, లోక్‌సభ సభ్యురాలు సౌగతా రాయ్‌లకు మాత్రం చోటు దక్కలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని