పోలీసు దళాల ఆధునికీకరణకు రూ.26,275 కోట్లు

పోలీసు దళాల ఆధునికీకరణ బృహత్తర పథకాన్ని(ఎంపీఎఫ్‌) రూ.26,275 కోట్లతో మరో ఐదేళ్ల పాటు(2021-22 నుంచి 2025-26 వరకూ) కొనసాగించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. జమ్మూ-కశ్మీర్‌, తిరుగుబాటు దళాల ప్రభావిత ఈశాన్య రాష్ట్రాలు,

Published : 14 Feb 2022 04:50 IST

మరో ఐదేళ్లపాటు అమలుకు కేంద్రం నిర్ణయం

దిల్లీ: పోలీసు దళాల ఆధునికీకరణ బృహత్తర పథకాన్ని(ఎంపీఎఫ్‌) రూ.26,275 కోట్లతో మరో ఐదేళ్ల పాటు(2021-22 నుంచి 2025-26 వరకూ) కొనసాగించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. జమ్మూ-కశ్మీర్‌, తిరుగుబాటు దళాల ప్రభావిత ఈశాన్య రాష్ట్రాలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో భద్రత సంబంధిత కార్యకలాపాలకు ఈ నిధులను వ్యయం చేయనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వశాఖ పేర్కొంది. నూతన బెటాలియన్లు, అత్యాధునిక ఫోరెన్సిక్‌ ప్రయోగశాలల ఏర్పాటు, ఇతర పరిశోధన సాధనాల అభివృద్ధి తదితర చర్యలను ఈ పథకంలో భాగంగా చేపట్టనున్నట్లు వెల్లడించింది  దీనిద్వారా మాదక ద్రవ్యాల నియంత్రణ, నేర న్యాయ వ్యవస్థను బలోపేతం చేసే విషయంలో రాష్ట్రాలకు సహకారం అందించనున్నట్లు తెలిపింది. మొత్తం నిధుల్లో రూ.18,839 కోట్లను జమ్మూ-కశ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కార్యకలాపాలకు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. రాష్ట్రాల పోలీసు వ్యవస్థలను ఆధునికీకరించేందుకు రూ.4,846 కోట్లను, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో శాస్త్రీయ, సమయానుకూల పరిశోధనకు ఉపకరించే అత్యాధునిక ఫోరెన్సిక్‌ సైన్స్‌ వ్యవస్థల ఏర్పాటుకు రూ.2,080.50 కోట్లను కేటాయించనున్నట్లు తెలిపింది. మావోయిస్టులను ఎదుర్కోవడానికి అమలు చేస్తున్న ‘జాతీయ విధానం, కార్యాచరణ ప్రణాళిక’తో ఆ తరహా హింస చాలావరకూ తగ్గిందని హోంశాఖ పేర్కొంది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రూ.8,689 కోట్లతో మరో ఆరు పథకాలకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది. ఇండియా రిజర్వ్‌ బెటాలియన్ల బలాన్ని పెంచడం కోసం రూ.350 కోట్లు, మాదక ద్రవ్యాల నియంత్రణలో రాష్ట్రాలకు సాయం కోసం రూ.50కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని