ఒడిశా మాజీ సీఎం హేమానంద బిశ్వాల్‌ కన్నుమూత

ఒడిశా మాజీ ముఖ్యమంత్రి హేమానంద బిశ్వాల్‌ (83) శుక్రవారం రాత్రి భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజుల క్రితం ఆయన అస్వస్థతకు

Published : 26 Feb 2022 05:14 IST

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ఒడిశా మాజీ ముఖ్యమంత్రి హేమానంద బిశ్వాల్‌ (83) శుక్రవారం రాత్రి భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజుల క్రితం ఆయన అస్వస్థతకు గురయ్యారు. పశ్చిమ ఒడిశా జిల్లాల్లో ప్రముఖ ఆదివాసి నేత అయిన బిశ్వాల్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎనలేని సేవలందించారు. ఝార్సుగుడ జిల్లా ఠాకూర్‌పడలో జన్మించిన ఆయన సుందర్‌గఢ్‌ జిల్లా నుంచి రాజకీయాలు నడిపారు. 1974లో తొలిసారిగా లైకిడ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తర్వాత వరుసగా అయిదుసార్లు శాసనసభకు ప్రాతినిథ్యం వహించిన ఆయన జేబీ పట్నాయక్‌ మంత్రివర్గంలో పలుశాఖల మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. 1999 నుంచి 2000 వరకు ముఖ్యమంత్రిగా సేవలందించారు. 2009 నుంచి 2014 వరకు సుందర్‌గఢ్‌ ఎంపీగా సమర్థ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందారు. కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన అనారోగ్య కారణాలతో భువనేశ్వర్‌లో ఉండి చికిత్సలు పొందుతున్నారు. బిశ్వాల్‌ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, ఒడిశా గవర్నర్‌ ఆచార్య గణేశీలాల్‌, ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్‌, పీసీసీ అధ్యక్షుడు నిరంజన్‌ పట్నాయక్‌ సంతాపం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని