ఉక్రెయిన్‌ నుంచి భారతీయుల తరలింపు ముమ్మరం

రష్యా యుద్ధంతో కకావికలమైన ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ముమ్మర ప్రయత్నాల్లో పురోగతి సాధిస్తున్నట్లు విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌ తెలిపారు.

Updated : 27 Feb 2022 06:13 IST

ముంబయికి చేరిన తొలి విమానం.. నేడు మరో రెండు
బుకారెస్ట్‌, బుడాపెస్ట్‌ నుంచి ఎయిరిండియా సేవలు
స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి జైశంకర్‌

దిల్లీ, ముంబయి: రష్యా యుద్ధంతో కకావికలమైన ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ముమ్మర ప్రయత్నాల్లో పురోగతి సాధిస్తున్నట్లు విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌ తెలిపారు. ఇప్పటికే రొమేనియా సరిహద్దులకు చేరుకున్న 219 మందితో తొలి ఎయిరిండియా విమానం రాజధాని నగరమైన బుకారెస్ట్‌ నుంచి శనివారం మధ్యాహ్నం ముంబయికి బయల్దేరినట్లు ఆయన ట్వీట్‌ చేశారు. దీనివెనుకే 250 మంది ప్రయాణికులతో మరో విమానం కూడా బయలుదేరనుంది. తొలి విమానం శనివారం రాత్రి 7.50 గంటలకు ముంబయికి చేరుకొంది. విమానాశ్రయంలో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రయాణికులకు స్వాగతం పలికారు. రెండో విమానం ఆదివారం ఉదయం దిల్లీకి చేరుతుంది. మూడో విమానం కూడా ఇదే సమయానికి భారత్‌కు చేరుకొంటుంది. ఉక్రెయిన్‌ గగన తలాన్ని పౌర విమానాలు వాడుకోకుండా నిషేధం ఉన్నందున రోడ్డు మార్గాన ఇతర వాహనాల్లో రొమేనియా సరిహద్దులకు చేరుకొంటున్నవారిని భారతీయ అధికారులు విమానాశ్రయానికి తరలిస్తున్నారు. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నుంచి రొమేనియా సరిహద్దు చెక్‌పాయింటు దాదాపు 600 కి.మీ.ల దూరం ఉంటుంది. అక్కడినుంచి బుకారెస్ట్‌కు మరో 500 కి.మీ. ప్రయాణించాలి. మరోవైపు.. హంగరీ రాజధాని బుడాపెస్ట్‌ నుంచి కూడా భారతీయుల తరలింపునకు చర్యలు తీసుకొంటున్నారు. కీవ్‌ నుంచి హంగరీ సరిహద్దు చెక్‌పాయింటు 820 కి.మీ. ఉంటుంది. మరో బృందంగా భారతీయ విద్యార్థులు శనివారం ఇక్కడికి చేరుకొన్నారు. ఈ సహాయక చర్యలను స్వయంగా తానే పర్యవేక్షిస్తున్నట్లు మంత్రి జైశంకర్‌ చెప్పారు. భారతీయుల తరలింపులో సహకారం అందించిన రొమేనియా విదేశాంగశాఖ మంత్రి బోగ్దాన్‌ అరెస్కూకు కృతజ్ఞతలు తెలిపారు. ‘చివరి భారతీయ పౌరుణ్ని ఉక్రెయిన్‌ నుంచి తరలించేదాకా మా ప్రయత్నం ఆగదు’ అని రొమేనియా చేరుకొన్న విద్యార్థులనుద్దేశించి అక్కడి భారత రాయబారి రాహుల్‌ శ్రీవాత్సవ భరోసా కల్పించారు. దాదాపు 20 వేలమంది భారతీయులు ఉక్రెయిన్‌లో ఉంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. వీరిలో విద్యార్థులే ఎక్కువ. అత్యధికంగా గుజరాత్‌ నుంచి 2,500 మంది, కేరళ నుంచి 2,320 మంది విద్యార్థులు అక్కడ ఉంటున్నారు. 

మంత్రివర్గ కమిటీకి ‘ఉక్రెయిన్‌’పై వివరణ

యుద్ధ సంక్షోభంలో ఉన్న ఉక్రెయిన్‌ పరిస్థితులను, భారతీయులను అక్కడి నుంచి సురక్షితంగా తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను శనివారం భద్రత వ్యవహారాల కేంద్ర మంత్రివర్గ కమిటీకి వివరించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్‌ ఇరుగు పొరుగున ఉన్న రొమేనియా, హంగరీ వంటి దేశాల మీదుగా ఎయిరిండియా ప్రత్యేక విమానాల ద్వారా ప్రభుత్వం భారతీయులను వెనక్కు తీసుకువస్తున్నట్లు వివరించారు. ఉక్రెయిన్‌ నుంచి తమ దేశానికి చేరుకున్న భారతీయులకు సహాయం చేస్తున్నామని భారత్‌లోని పోలండ్‌ రాయబారి ఆడం బురాకౌస్కీ తెలిపారు.

విద్యార్థులను సత్వరం తరలించాలి : రాహుల్‌

ఉక్రెయిన్‌లో చిక్కుకొన్న భారతీయ విద్యార్థులందరినీ సత్వరం తరలించాలని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ శనివారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రష్యన్‌ దళాల దాడుల మధ్య బంకర్‌లో తలదాచుకొన్న కర్ణాటక విద్యార్థుల వీడియోను ఆయన షేర్‌ చేశారు. ‘ఇటువంటి దృశ్యాలు చూస్తే మనసు కలతపడుతోంది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం. కేంద్రం సహాయకచర్యలు ముమ్మరం చేయాలని మరోమారు కోరుతున్నా’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు.


చెప్పేదాకా బయటికి రావొద్దు..

కీవ్‌: ఉక్రెయిన్‌లోని భారతీయ ఎంబసీ అధికారులు ఇంకా అక్కడే చిక్కుకొని ఉన్న భారతీయులకు తాజా మార్గదర్శకాలు జారీ చేశారు. ముఖ్యంగా ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతాల్లోని వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ‘మేము తదుపరి సూచనలు చేసేవరకు ఎక్కడివాళ్లు అక్కడే మౌనంగా ఉండండి. అనవసరంగా బయటికి రావద్దు. ఇంట్లో ఉన్న ఆహారం, నీటితోనే సర్దుకొని సంయమనం పాటించండి. చుట్టుపక్కల పరిణామాలు జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. భారతీయ అధికారుల నుంచి సంకేతాలు అందేవరకు సరిహద్దుల వైపు ఎవరూ వెళ్లవద్దు’ అని సూచనలు చేశారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని