Kendriya Vidyalaya: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు గరిష్ఠ వయసు పెంపు

కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో చేరే విద్యార్థుల కనిష్ఠ, గరిష్ఠ వయసుల్లో మార్పుచేశారు. 2022-23 విద్యా సంవత్సరంలో ప్రవేశం కోరే వారికి కనిష్ఠంగా ఆరేళ్లు, గరిష్ఠంగా 8 ఏళ్లు ఉండాలని కేంద్రీయ విద్యాలయ

Updated : 28 Feb 2022 09:37 IST

ఒకటో తరగతికి కనిష్ఠం ఆరేళ్లు, గరిష్ఠం 8 ఏళ్లు

నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

ఈనాడు, దిల్లీ: కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో చేరే విద్యార్థుల కనిష్ఠ, గరిష్ఠ వయసుల్లో మార్పుచేశారు. 2022-23 విద్యా సంవత్సరంలో ప్రవేశం కోరే వారికి కనిష్ఠంగా ఆరేళ్లు, గరిష్ఠంగా 8 ఏళ్లు ఉండాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ పేర్కొంది. ఈ రెండు వయసుల మధ్య ఉన్నవారికి మాత్రమే కొత్త విద్యా సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తామని, అంతకంటే తక్కువ, ఎక్కువ వయసున్నవారి దరఖాస్తులు అనుమతించబోమని స్పష్టం చేసింది. గతంలో అయిదు నుంచి ఏడేళ్ల వరకు వయసు ఉన్న పిల్లలకు ఒకటో తరగతిలో ప్రవేశం ఉండేది. ఇప్పుడు నూతన జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి కనీస వయసును 6 ఏళ్లకు, గరిష్ఠ వయసును 8 ఏళ్లకు పెంచింది. దివ్యాంగులకు గరిష్ఠ వయసులో 2 ఏళ్ల సడలింపు ఇచ్చింది. దీని ప్రకారం ఒకటో తరగతిలో దరఖాస్తు చేసుకొనే పిల్లలు 2014 ఏప్రిల్‌ 1 నుంచి 2016 ఏప్రిల్‌ 1 మధ్య పుట్టినవారై ఉండాలి. దివ్యాంగులైతే 2012 ఏప్రిల్‌ 1 నుంచి 2016 ఏప్రిల్‌ 1 మధ్యలో జన్మించి ఉండొచ్చు. ఒకటో తరగతి ప్రవేశాలకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ తెలిపింది. మార్చి 21వ తేదీ సాయంత్రం 7 గంటలవరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని వెల్లడించింది. మార్చి 25న తొలి, ఏప్రిల్‌ 1న రెండు, ఏప్రిల్‌ 8న మూడో ఎంపిక జాబితా ప్రచురిస్తామని తెలిపింది. రెండు, ఆ పై తరగతుల ప్రవేశాలకు (11వ తరగతి మినహాయించి) ఆఫ్‌లైన్‌ విధానంలో ఏప్రిల్‌ 8 నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్‌ 21న ఎంపిక జాబితా విడుదల చేస్తారు. ఏప్రిల్‌ 22 నుంచి 28 మధ్యలో ఈ తరగతులకు ప్రవేశాలు పూర్తిచేస్తారు. అన్ని తరగతుల ప్రవేశాలకు చివరి తేదీ (11వ తరగతికి మినహాయించి) జూన్‌ 30గా నిర్ణయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని