జమ్మూ-కశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన

కొంతకాలంగా ఎదురుచూస్తున్న జమ్మూ-కశ్మీర్‌ నియోజకవర్గాల పునర్విభజన మరో అడుగు ముందుకేసింది. ఇందుకు సంబంధించిన కమిషన్‌ తన ముసాయిదా నివేదికను సోమవారం బహిర్గతం చేసింది. కశ్మీర్‌ డివిజన్‌లో హబ్బా కదల్‌, జమ్మూలోని

Published : 15 Mar 2022 05:22 IST

 ప్రతిపాదిత నివేదికను వెల్లడించిన కమిషన్‌

  21వ తేదీ వరకూ అభ్యంతరాల స్వీకరణ

జమ్ము: కొంతకాలంగా ఎదురుచూస్తున్న జమ్మూ-కశ్మీర్‌ నియోజకవర్గాల పునర్విభజన మరో అడుగు ముందుకేసింది. ఇందుకు సంబంధించిన కమిషన్‌ తన ముసాయిదా నివేదికను సోమవారం బహిర్గతం చేసింది. కశ్మీర్‌ డివిజన్‌లో హబ్బా కదల్‌, జమ్మూలోని సుచేత్‌గఢ్‌ అసెంబ్లీ సీట్లను పునరుద్ధరిస్తున్నట్టు పేర్కొంది. రాజకీయ పార్టీల అభ్యంతరాలను తోసిపుచ్చుతూ- తన నివేదికను పత్రికల ద్వారా అందుబాటులోకి తెచ్చింది. దీనిపై ఈనెల 21 వరకూ సూచనలు, సలహాలు స్వీకరిస్తామని, ఆ తర్వాత క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తామని తెలిపింది. కమిషన్‌ తొలుత హబ్బా కదల్‌, సుచేత్‌గఢ్‌ స్థానాల రద్దుకు  ప్రతిపాదించగా, భాజపా జమ్మూ-కశ్మీర్‌ విభాగం అభ్యంతరం తెలిపింది. దీంతో వీటిని తాజా నివేదికలో పునరుద్ధరించారు. జమ్మూ-కశ్మీర్‌లో 5 లోక్‌సభ స్థానాలను కొనసాగిస్తూ... అసెంబ్లీ స్థానాలను 83 నుంచి 90కి పెంచుతున్నట్టు కమిషన్‌ పేర్కొంది. వీటిలో జమ్ము పరిధిలోకి 43, కశ్మీర్‌ పరిధిలోకి 47 స్థానాలు వస్తాయని వివరించింది. పెంచిన సీట్లలో ఆరు జమ్మూలో, ఒకటి కశ్మీర్‌లో ఉన్నాయి. మొత్తం స్థానాల్లో ఎస్సీలకు 7, ఎస్టీలకు 9 కేటాయించినట్టు కమిషన్‌ తెలిపింది.

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రంజనా ప్రకాశ్‌ దేశాయ్‌ అధ్యక్షతన 2020, మార్చి 6న ఏర్పాటైన ఈ కమిషన్‌లో మొత్తం ఐదుగురు సభ్యులున్నారు. ముసాయిదా ప్రతిపాదనలకు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఎంపీలు ఫరూక్‌ అబ్దుల్లా, మసూది, మహమ్మద్‌ అక్బర్‌ లోన్‌లతో పాటు.. మరో సభ్యుడైన భాజపా ఎంపీ జుగల్‌ కిషోర్‌ కూడా భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ ఈ కమిషన్‌లో ఐదో సభ్యునిగా ఉన్నారు.

‘‘ఇష్టారాజ్యంగా నిర్ణయించారు...’’

ముసాయిదా ప్రతిపాదనలు రాజ్యాంగానికి, చట్టానికి విరుద్ధంగా ఉన్నాయని, నియోజకవర్గాల సరిహద్దులను ఇష్టానుసారం ఏకపక్షంగా నిర్ణయించారని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ విమర్శించింది. అనంత్‌నాగ్‌ నియోజకవర్గంలో పూంచ్‌, రాజౌరీ ప్రాంతాలను కలపడాన్ని తప్పుపట్టింది. అత్యంత ఎత్తయిన పర్వతాలు రెండుగా విభజించే ఈ ప్రాంతాలను ఒక్క నియోజకవర్గంలో కలపడం సరికాదని పేర్కొంది. నియోజకవర్గాల పునర్విభజనలో మౌలిక అంశాలను విస్మరించారని ఆరోపించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని