బెంగాల్‌ అసెంబ్లీలో పిడిగుద్దులు

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. బడ్జెట్‌ సమావేశాల చివరి రోజున అధికార టీఎంసీ, ప్రతిపక్ష భాజపా శాసనసభ్యుల మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం చివరకు ఘర్షణకు దారితీసింది. పరస్పర దాడుల్లో

Published : 29 Mar 2022 06:10 IST

పరస్పరం కొట్టుకున్న అధికార, ప్రతిపక్ష సభ్యులు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. బడ్జెట్‌ సమావేశాల చివరి రోజున అధికార టీఎంసీ, ప్రతిపక్ష భాజపా శాసనసభ్యుల మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం చివరకు ఘర్షణకు దారితీసింది. పరస్పర దాడుల్లో ఇరు వర్గాల వారికీ గాయాలయ్యాయి. ప్రతిపక్ష నేత సువేందు అధికారి సహా అయిదుగురు భాజపా ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు. శాసనసభ సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన వెంటనే భాజపా ఎమ్మెల్యేలు 25 మంది తమ నేత సువేందు అధికారి నేతృత్వంలో సభా మధ్యంలోకి దూసుకెళ్లారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ఆరోపించారు. బీర్‌భూం జిల్లాలో 8 మంది సజీవ దహనం ఘటనకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. నినాదాలు చేస్తున్న విపక్ష ఎమ్మెల్యేలు సీట్లలోకి వెళ్లి కూర్చోవాలని సభాపతి విజ్ఞప్తి చేస్తున్న సమయంలోనే అధికార పక్ష సభ్యులు వారితో వాగ్వాదానికి దిగారు. ఇది పరస్పర దాడులకు, పిడిగుద్దులకు దారి తీసింది. అనంతరం తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి సువేందు అధికారి సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.

అయిదుగురు భాజపా సభ్యుల సస్పెన్షన్‌

పరస్పర దాడుల్లో గాయపడిన టీఎంసీ ఎమ్మెల్యే అసిత్‌ మజుందార్‌, భాజపా చీఫ్‌ విప్‌ మనోజ్‌ టిగ్గాను ఆసుపత్రికి తరలించారు. ఈ ఏడాది చివరి వరకు శాసనసభలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి, మరోనలుగురు భాజపా ఎమ్మెల్యేలు...దీపక్‌ బర్మన్‌, శంకర్‌ఘోష్‌, మనోజ్‌ టిగ్గా, నరహరి మహతోలను సస్పెండ్‌ చేస్తున్నట్లు సభాపతి బిమన్‌ బందోపాధ్యాయ్‌ ప్రకటించారు. దుష్ప్రవర్తనకు గాను వారిపై చర్య తీసుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేశారు.

* బీర్‌భూం జిల్లా బోగ్‌టూయి గ్రామ సజీవ దహనం ఘటనలో మృతుల సంఖ్య 9కి పెరిగింది. తీవ్రంగా కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న నజేమా బీబీ సోమవారం ఉదయం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 21 రాత్రి బోగ్‌టూయిలోని ఇళ్లకు నిప్పంటుకున్న ఘటనలో 8 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని