PM Modi: పరీక్షలే పండగలవ్వాలి

పరీక్షల్ని చూసి ఏమాత్రం ఒత్తిడికి గురవ్వొద్దని విద్యార్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. వాటిని పండగల్లా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. సాంకేతికత ఎంతమాత్రమూ వినాశహేతువు కాదన్నారు.

Updated : 02 Apr 2022 06:01 IST

 వాటిని చూసి ఒత్తిడికి గురవ్వొద్దు

 ఆన్‌లైన్‌లో ఏం చేస్తున్నారో ఆత్మావలోకనం చేసుకోండి

 ‘పరీక్షా పే చర్చా’లో విద్యార్థులకు ప్రధాని మోదీ సూచనలు

దిల్లీ: పరీక్షల్ని చూసి ఏమాత్రం ఒత్తిడికి గురవ్వొద్దని విద్యార్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. వాటిని పండగల్లా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. సాంకేతికత ఎంతమాత్రమూ వినాశహేతువు కాదన్నారు. అభ్యసన ప్రక్రియలో దాన్ని సమర్థంగా ఉపయోగించుకోవాలంటూ దిశానిర్దేశం చేశారు. దిల్లీలోని తాల్‌కటోరా స్టేడియం వేదికగా శుక్రవారం నిర్వహించిన ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమంలో భాగంగా పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులతో మోదీ మాట్లాడారు. వారు అడిగిన ప్రశ్నలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. పరీక్షలపై ఉన్న భయాన్ని అధిగమించేందుకు విలువైన సూచనలు చేశారు. విశేషాలు ఆయన మాటల్లోనే..

అసలు సమస్య మనసే

వాట్సప్‌, యూట్యూబ్‌ వంటి మాధ్యమాల కారణంగా చదువు నుంచి దృష్టి మళ్లుతుందనడం సరికాదు. ఆ మాధ్యమాలేవీ కాదు.. మనసే మన అసలైన సమస్య. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌.. ఏదైనా సరే.. మనసు చదువుపై లగ్నమై ఉంటే మిగతావేవీ విద్యార్థులకు సమస్యలుగా మారవు. అభ్యసనం కోసం అందుబాటులోకి వచ్చిన కొత్త విధానాలను అవకాశాలుగా చూడాలే తప్ప.. సవాళ్లుగా కాదు. ఆఫ్‌లైన్‌ చదువుకు మరింత మెరుగులు దిద్దుకునేందుకు ‘ఆన్‌లైన్‌’ ఉపయోగపడొచ్చు. ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు సమయాన్ని చదువు కోసం ఉపయోగించుకుంటున్నామా, లేదంటే సామాజిక మాధ్యమాల కోసమా అన్న సంగతిని ఆత్మావలోకనం చేసుకోవాలి.

ప్రశాంతంగా ఉండండి

మీరు పరీక్షలు రాయడం ఇదే తొలిసారి కాదు. ఒకరకంగా చెప్పాలంటే మీరంతా పరీక్షలకు నిరోధకత కలిగి ఉన్నారు. అవి మిమ్మల్నేమీ చేయలేవు. కాబట్టి ఒత్తిడికి గురవ్వొద్దు. ఇంతకుముందు చాలా పరీక్షల్ని మీరు విజయవంతంగా రాశారన్న సంగతిని గుర్తుచేసుకొని ప్రశాంతంగా ఉండండి. ఇతరుల్ని అనుకరించడంలో అర్థం లేదు. మీరు మహాసముద్రమంతటినీ ఈది ఒడ్డుకు చేరువయ్యారు. ఇప్పుడు మునిగిపోతామేమోనని భయపడటంలో అర్థం లేదు.

పోటీ మంచిదే

బోర్డు పరీక్షలు, కళాశాలల అడ్మిషన్లలో వచ్చే మార్పుల కారణంగా విద్యార్థుల మధ్య పోటీ పెరుగుతోంది. అది మంచి పరిణామమే. పోటీ ఉంటేనే మన అసలైన సత్తా బయటికొస్తుంది. మీకున్న అవకాశాలు కోకొల్లలు.

బాలికల సామర్థ్యాల్ని గుర్తించాలి

కుమారులు, కుమార్తెలను తల్లిదండ్రులు సమానంగా చూడాలి. వారికి సమాన అవకాశాలు కల్పించాలి. బాలికల సామర్థ్యాల్ని గుర్తించడంలో విఫలమైతే.. సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రగతి బాట పట్టదు. ప్రస్తుతం సమాజంలో సానుకూల మార్పులొస్తున్నాయి. ప్రతి కుటుంబానికి బాలికలు పెద్ద ఆస్తిగా, బలంగా మారుతున్నారు. పోలీసు, భద్రతా బలగాల్లోనూ వారి సంఖ్య పెరుగుతోంది. బోర్డు పరీక్షల్లో పదేపదే బాలుర కంటే బాలికలు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు.

ఉపాధ్యాయులు మాతో చదివిస్తారు కాబట్టి మేం అర్థం చేసుకోగలుగుతాం. కానీ కొన్నిరోజుల తర్వాత మేం మరిచిపోతాం. అలా మరిచిపోకుండా ఏ చేయాలో దయచేసి చెప్పండి.?

- యాదా అనూష, ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, నాగులవంచ,ఖమ్మం

ప్రధాని: మరుపు అన్నది ప్రతి విద్యార్థి మదిలో ఎప్పుడోసారి ఉదయిస్తూనే ఉంటుంది. చదివింది గుర్తుండటంలేదని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంటుంది. కానీ పరీక్ష హాల్‌లోకి వెళ్లిన తర్వాత అన్నీ గుర్తుకొస్తూనే ఉంటాయి. మీరు చదివింది మీకు తెలియకుండానే మీ మదిలో నిక్షిప్తమై ఉంటుంది. మనసు లగ్నం చేస్తే గుర్తుకొస్తాయి. అందువల్ల మీరు ఎక్కడుంటే అక్కడ మనసు పెట్టడం నేర్చుకోండి. మీరున్న ప్రతిక్షణాన్ని ఆస్వాదించడం నేర్చుకుంటే అదే మీ శక్తిలా మారుతుంది. జ్ఞాపకశక్తిని కేవలం పరీక్షలకు మాత్రమే పరిమితం చేయకుండా విస్తరిస్తూ పోండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు