Ukraine Crisis: భారత్‌ది శాంతి పక్షమే

రష్యా-ఉక్రెయిన్‌ సంఘర్షణను భారత్‌ గట్టిగా వ్యతిరేకిస్తోందని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ తెలిపారు. ఎవరి వైపు ఉండాలన్న ప్రశ్న ఉత్పన్నమైతే...మన దేశం శాంతిపక్షమే వహిస్తోందని, తక్షణం హింస ఆగిపోవాలని కోరుకుంటుందని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌ పరిస్థితిపై లోక్‌సభలో జరిగిన చర్చకు ఆయన బుధవారం సమాధానమిచ్చారు.

Published : 07 Apr 2022 06:03 IST

మధ్యవర్తిత్వం వహించేందుకూ సిద్ధం  
రష్యా-ఉక్రెయిన్‌ సంక్షోభంపై కేంద్ర మంత్రి జైశంకర్‌

దిల్లీ: రష్యా-ఉక్రెయిన్‌ సంఘర్షణను భారత్‌ గట్టిగా వ్యతిరేకిస్తోందని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ తెలిపారు. ఎవరి వైపు ఉండాలన్న ప్రశ్న ఉత్పన్నమైతే...మన దేశం శాంతిపక్షమే వహిస్తోందని, తక్షణం హింస ఆగిపోవాలని కోరుకుంటుందని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌ పరిస్థితిపై లోక్‌సభలో జరిగిన చర్చకు ఆయన బుధవారం సమాధానమిచ్చారు. సంప్రదింపుల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలన్నది మన దేశ విధానమని తెలిపారు. రష్యా-ఉక్రెయిన్‌ అధ్యక్షుల స్థాయి చర్చలనూ భారత్‌ ప్రోత్సహిస్తుందని, అవసరమైతే ఈ అంశంలో సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఇదే విషయాన్ని ఇటీవల దిల్లీ వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గెయ్‌ లవ్రోవ్‌కు తెలిపామన్నారు. ఉక్రెయిన్‌ నగరం బుచాలో పౌరుల దారుణ హత్యలపైనా జైశంకర్‌ స్పందించారు. అక్కడి నుంచి వెలువడుతున్న నివేదికలు తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. ‘అమానుష చర్యలను గట్టిగా ఖండిస్తున్నాం. ఇది అత్యంత గర్హనీయమైన విషయం. స్వతంత్ర దర్యాప్తు జరిపించాలన్న డిమాండ్‌కు మద్దతిస్తున్నాం’ అని అన్నారు. ఉక్రెయిన్‌పై భారత్‌ వైఖరికి రాజకీయ రంగులు పులమటం దురదృష్టకరమని తెలిపారు. ‘రష్యా-ఉక్రెయిన్‌ సంఘర్షణను ప్రారంభంలోనే మన దేశం గట్టిగా వ్యతిరేకించింది. రక్తం చిందించడం ద్వారా, అమాయక ప్రజల ప్రాణాలు తీయడం ద్వారా సమస్యకు పరిష్కారం లభించదని దృఢంగా విశ్వసిస్తున్నాం. ఎటువంటి వివాదానికైనా సంప్రదింపులు, దౌత్య మార్గాలే సరైన పరిష్కారం’ అని జైశంకర్‌ అన్నారు.  ఉక్రెయిన్‌ ఉప ప్రధాని యులియా కొద్ది రోజుల కిందట ఫోన్‌ చేసి అత్యవసరంగా ఔషధాలు సరఫరా చేయాలని కోరారని, వాటిని పంపించే ఏర్పాట్లలో ఉన్నామని వెల్లడించారు.యుద్ధం వల్ల ఇంధనం, ఎరువుల ధరలు పెరుగుతున్నాయని, వంట నూనెల దిగుమతులకు ఆటంకం కలుగుతోందని, ఇవి మన దేశ ప్రజలపై నేరుగా ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. ఈ పరిణామాల వల్ల ఆహార ధరలు పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని గుర్తుచేశారు.

విద్యార్థుల చదువుల కొనసాగింపుపై..
ఉక్రెయిన్‌ నుంచి పౌరుల తరలింపును మన దేశమే మొట్టమొదటిగా, సంపూర్ణంగా చేపట్టగలిగిందని జైశంకర్‌ వివరించారు. ఈ విషయంలో ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచామని చెప్పారు. ఉక్రెయిన్‌ నుంచి స్వదేశానికి వచ్చిన వైద్య విద్యార్థుల చదువులకు అంతరాయం కలగకుండా నివారించేందుకు హంగరీ, రుమేనియా, కజఖ్‌స్థాన్‌, పోలండ్‌ తదితర దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. వైద్య విద్య కోర్సుల్లో రెండు ప్రధానమైన పరీక్షల నుంచి విద్యార్థులకు మినహాయింపునిస్తామని ఉక్రెయిన్‌ ప్రభుత్వం తెలిపిందని పేర్కొన్నారు. మూడు లేదా నాలుగో సంవత్సరాల్లోకి విద్యార్థులను ప్రమోట్‌ చేసే విషయంలోనూ వెసులుబాటు కల్పించే అవకాశం ఉందన్నారు.  

విదేశాంగ విధానంపై ఆరోగ్యకరమైన చర్చ: ప్రధాని మోదీ
ఉక్రెయిన్‌ పరిస్థితులపై రెండు రోజుల పాటు లోక్‌సభలో ఆరోగ్యకరమైన చర్చ జరిగిందని, విదేశాంగ విధానంపై అధికార, విపక్ష సభ్యులు తమ అభిప్రాయాలను హుందాగా వెల్లడించారని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ప్రపంచ యవనికపై భారత్‌ స్థాయిని ఇది ఇనుమడింపజేస్తుందని తెలిపారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన మన దేశ పౌరులను క్షేమంగా తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సర్వశక్తులను ఒడ్డిందని, ఆపరేషన్‌ గంగను విజయవంతంగా చేపట్టగలిగిందని ప్రధాని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని