Corona Virus: పురుషుల పునరుత్పత్తి వ్యవస్థపై కొవిడ్‌ దెబ్బ!

శ్వాసవ్యవస్థపైనే కాదు... పురుషుల్లో పునరుత్పత్తి వ్యవస్థపైనా కొవిడ్‌ తీవ్రంగానే ప్రభావం చూపుతున్నట్టు తాజా పరిశోధనలో తేలింది! ఇన్‌ఫెక్షన్‌ కారణంగా స్వల్ప, మధ్యస్థాయి లక్షణాలే కనిపించినా... వారి సంతానోత్పత్తిని మాత్రం

Updated : 12 Apr 2022 07:23 IST

ఐఐటీ-బాంబే శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి

దిల్లీ: శ్వాసవ్యవస్థపైనే కాదు... పురుషుల్లో పునరుత్పత్తి వ్యవస్థపైనా కొవిడ్‌ తీవ్రంగానే ప్రభావం చూపుతున్నట్టు తాజా పరిశోధనలో తేలింది! ఇన్‌ఫెక్షన్‌ కారణంగా స్వల్ప, మధ్యస్థాయి లక్షణాలే కనిపించినా... వారి సంతానోత్పత్తిని మాత్రం గట్టిగానే దెబ్బతీస్తున్నట్టు వెల్లడైంది. ఐఐటీ-బాంబే, ముంబయిలోని జస్‌లోక్‌ ఆసుపత్రి-పరిశోధన కేంద్రం నిపుణులు దీన్ని చేపట్టారు. పురుషుల పునరుత్పత్తి అవయవాల్లో కరోనా వైరస్‌ ఉనికి ఉంటున్నట్టు ఇటీవల కొన్ని ఆధారాలు లభ్యమైన క్రమంలో- మగవారి పునరుత్పత్తి వ్యవస్థపై మహమ్మారి ప్రభావం చూపుతోందా? అన్న విషయాన్ని కనుగొనేందుకు వారు ప్రయత్నించారు. ఇందులో భాగంగా కొవిడ్‌ నుంచి కోలుకున్న 17 మంది, ఇన్‌ఫెక్షన్‌ సోకని సంపూర్ణ ఆరోగ్యవంతులైన మరో పదిమంది పురుషుల వీర్యంలోని ప్రొటీన్ల స్థాయులను విశ్లేషించారు. వీరంతా వంధ్యత్వం లేని 20-45 ఏళ్ల వయసువారేనని పరిశోధకులు తెలిపారు.

ఆ కణాలు తగ్గిపోతున్నాయి...

‘‘కొవిడ్‌ బాధితుల్లో వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉంటోంది. వాటి చలనశీలత అంతంతమాత్రమే. ఆకారంలోనూ మార్పులు కనిపిస్తున్నాయి. పునరుత్పత్తికి దోహదపడే వీర్యంలోని 27 ప్రొటీన్ల స్థాయులు పెరగ్గా, 21 ప్రొటీన్ల స్థాయులు తగ్గాయి. ముఖ్యంగా సెమెనోజెలిన్‌-1, ప్రొసాపోసిన్‌ ప్రొటీన్ల స్థాయులు ఉండాల్సిన దానిలో సగం కంటే తక్కువగానే ఉంటున్నట్టు గుర్తించాం’’ అని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ విషయాలను మరింత విస్పష్టంగా నిర్ధారించుకునేందుకు విస్తృతస్థాయిలో పరిశోధన సాగించాల్సి ఉందన్నారు. ఏసీఎస్‌ ఒమేగా పత్రిక ఈ వివరాలను అందించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని