హేతుబద్ధతే న్యాయవ్యవస్థకు జీవనాడి

సహేతుకత లోపించిన ఆదేశం నిరపేక్ష అధికారాన్ని తప్పుదోవపట్టిస్తుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ హెచ్చరించారు. హేతుబద్ధతే న్యాయవ్యవస్థకు జీవనాడి అని పేర్కొన్నారు. మేనకోడలిపై అత్యాచారం కేసులో అరెస్టైన వ్యక్తికి

Published : 20 Apr 2022 04:51 IST

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ వ్యాఖ్య

దిల్లీ: సహేతుకత లోపించిన ఆదేశం నిరపేక్ష అధికారాన్ని తప్పుదోవపట్టిస్తుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ హెచ్చరించారు. హేతుబద్ధతే న్యాయవ్యవస్థకు జీవనాడి అని పేర్కొన్నారు. మేనకోడలిపై అత్యాచారం కేసులో అరెస్టైన వ్యక్తికి రాజస్థాన్‌ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను మంగళవారం రద్దు చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తనపై అఘాయిత్యానికి పాల్పడిన మేనమామకు బెయిలివ్వడాన్ని ప్రశ్నిస్తూ బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అతని నేర ప్రవృత్తిని, 20కిపైగా కేసులు నమోదైన విషయాన్ని హైకోర్టు పట్టించుకోకుండా బెయిల్‌ ఇవ్వడాన్ని ఆమె సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ కృష్ణమురారి ధర్మాసనం తీర్పును వెలువరించింది. కుటుంబంలో ఓ పెద్దగా నిందితుడు బాధితురాలిపై ఎలాంటి ఒత్తిడి తెచ్చిఉంటాడో గమనించడంలో హైకోర్టు విఫలమైందని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు. ‘న్యాయస్థానాలు వెలువరించే ప్రతి ఆదేశం హేతుబద్ధంగా ఉండాలి. తర్కం, వివేకం న్యాయవ్యవస్థకు పునాదులు వంటివి’ అని తెలిపారు. 2021 మే నెలలో నిందితుడు 19ఏళ్ల మేనకోడలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతనిపై అప్పటికే 20కి పైగా కేసులు నమోదయ్యాయి. అవేవీ పట్టించుకోకుండానే రాజస్థాన్‌ హైకోర్టు సెప్టెంబరు 20న నిందితుడికి బెయిల్‌ మంజూరు చేసింది. బెయిల్‌ ఉత్తర్వులో హైకోర్టు వాటిని కనీసం ప్రస్తావించక పోవడాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ఎత్తిచూపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని