SUN: బుధవారం ఉదయం 9.27 నిమిషాలు.. భగ్గుమన్న భానుడి జ్వాలలు

భానుడు ఒక్క ఉదుటున భగ్గుమన్నాడు! బుధవారం ఉదయం 9.27 నిమిషాలకు ఒక్కసారిగా భారీ జ్వాలలు కురిపించాడు. సమాచార ఉపగ్రహాలు, జీపీఎస్‌ వ్యవస్థలు దెబ్బతినే స్థాయిలో ఇవి నమోదైనట్టు కోల్‌కతా కేంద్రంగా పనిచేసే

Updated : 22 Nov 2022 14:15 IST

ఉపగ్రహ, జీపీఎస్‌ వ్యవస్థలపై ప్రభావం

దిల్లీ: భానుడు ఒక్క ఉదుటున భగ్గుమన్నాడు! బుధవారం ఉదయం 9.27 నిమిషాలకు ఒక్కసారిగా భారీ జ్వాలలు కురిపించాడు. సమాచార ఉపగ్రహాలు, జీపీఎస్‌ వ్యవస్థలు దెబ్బతినే స్థాయిలో ఇవి నమోదైనట్టు కోల్‌కతా కేంద్రంగా పనిచేసే ‘సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ స్పేస్‌ సైన్సెస్‌ ఇండియా- (సెస్సీ)’ వెల్లడించింది. సౌర అయస్కాంత క్రియాశీల ప్రాంతమైన ఏఆర్‌-12992 నుంచి ఎక్స్‌-2.2 శ్రేణి సౌరజ్వాలలు వెలువడినట్టు వివరించింది. భారత్‌, ఆగ్నేయాసియా, ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో ఈ జ్వాలల ప్రభావం స్పష్టంగా కనిపించినట్టు సెస్సీ నిపుణులు గుర్తించారు. వీటి కారణంగా హై-ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్‌ వ్యవస్థలు స్తంభించడం, ఉపగ్రహాలు, జీపీఎస్‌ పనితీరులో లోపాలు తలెత్తడంతో పాటు... ఎయిర్‌లైన్స్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థలు కూడా ప్రభావితం కావచ్చని సెస్సీ సమన్వయకర్త, కోల్‌కతాలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ దివ్యేందు నంది పేర్కొన్నారు. సౌరజ్వాలల ప్రభావాన్ని అంచనా వేసేందుకు తమ బృందం ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.

ఏంటీ జ్వాలలు?

సౌరవ్యవస్థ నుంచి ఒక్కసారిగా శక్తి వెలువడడాన్నే సౌరజ్వాలలు (సోలార్‌ ఫ్లేర్‌) అంటారు. వీటి వల్ల రేడియా, నేవిగేషన్‌ సంకేతాలతో పాటు ఒక్కోసారి విద్యుత్‌ గ్రిడ్‌లు ప్రభావితమవుతాయి. ఫలితంగా విమానాలకూ, వ్యోమగాములకూ ముప్పు ఏర్పడే ఆస్కారముంది. ఇలాంటి సౌరజ్వాలలు వస్తాయని దివ్యేందు బృందం ఏప్రిల్‌ 18నే అంచనా వేసింది. భూకంపాల మాదిరే సౌరజ్వాలల తీవ్రతనూ నాసా వర్గీకరిస్తుంది. ‘ఏ’ నుంచి మొదలుపెట్టి బీ, సీ, ఎం, ఎక్స్‌ వంటి తరగతులుగా వాటిని విభజించింది. బుధవారం వచ్చిన ఎక్స్‌ తరగతి సౌరజ్వాలలు... అన్నింటికన్నా తీవ్రమైనవి. ఇంకా చెప్పాలంటే... ‘ఎం’ తరగతి సౌరజ్వాలల కన్నా పది రెట్లు, ‘సీ’ తరగతి జ్వాలల కన్నా వంద రెట్లు తీవ్రతతో ఇవి ఉంటాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని