ఈశాన్యంలో అఫ్సా రద్దు చేస్తాం

ఈశాన్య భారత్‌లో గత ఎనిమిదేళ్లలో శాంతిభద్రతలు చాలా మెరుగుపడ్డాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆ ప్రాంతంలో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఎఎఫ్‌ఎస్‌పీఏ-అఫ్సా) పూర్తిగా తొలగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

Published : 29 Apr 2022 06:42 IST

అస్సాం సహా ఇతర రాష్ట్రాల్లో శాంతిభద్రతలు మెరుగయ్యాయ్‌
ప్రధాని మోదీ వెల్లడి

ఈనాడు, గువాహటి: ఈశాన్య భారత్‌లో గత ఎనిమిదేళ్లలో శాంతిభద్రతలు చాలా మెరుగుపడ్డాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆ ప్రాంతంలో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఎఎఫ్‌ఎస్‌పీఏ-అఫ్సా) పూర్తిగా తొలగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అస్సాంలోని దిఫూలో ‘శాంతి, ఐక్యత, అభివృద్ధి’ ర్యాలీని ఉద్దేశించి ఆయన గురువారం ప్రసంగించారు. ఈశాన్య భారత్‌లో హింస 75 శాతం మేర తగ్గిందని పేర్కొన్నారు. ‘‘అస్సాంలో గత ప్రభుత్వాలు అఫ్సాను మూడు దశాబ్దాల పాటు పొడిగిస్తూ వచ్చాయి. అయినప్పటికీ అప్పట్లో శాంతిభద్రతలు మెరుగుపడలేదు. గత ఎనిమిదేళ్లలో పరిస్థితులు నియంత్రణలోకి వచ్చాయి. రాష్ట్రంలో చాలా ప్రాంతాల నుంచి అఫ్సాను ఉపసంహరించాం. మిగతా ప్రాంతాల్లోనూ దాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాం. నాగాలాండ్‌, మణిపుర్‌ వంటి ఇతర ఈశాన్య రాష్ట్రాల నుంచీ ఆ చట్టాన్ని వెనక్కి తీసుకునేందుకు కృషిచేస్తున్నాం’’ అని తెలిపారు. మేఘాలయ, అస్సాం ఇటీవల ఓ ఒప్పందంతో సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడాన్ని ప్రధాని మోదీ అభినందించారు. ఇతర రాష్ట్రాలూ అదే బాటలో నడిచేందుకు అది ప్రేరణనిస్తుందన్నారు. కర్బీ అంగ్లాంగ్‌లో పశువైద్య కళాశాల సహా పలు విద్యాసంస్థలకు ఆయన శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో 2,985 అమృత్‌ సరోవర్‌ ప్రాజెక్టులను ప్రారంభించారు.

ఆరోగ్య సదుపాయాలు మరింత పెంచుతాం
దేశంలో ఆరోగ్య రంగానికి సంబంధించి మౌలిక వసతులను మరింతగా పెంచేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందని మోదీ తెలిపారు. ముఖ్యంగా క్యాన్సర్‌ వంటి వ్యాధులతో బాధపడుతున్నవారికి తక్కువ ధరల్లో, అత్యుత్తమ చికిత్స అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అస్సాంలో రాష్ట్ర ప్రభుత్వం, టాటా ట్రస్టులు సంయుక్తంగా ‘అస్సాం క్యాన్సర్‌ కేర్‌ ఫౌండేషన్‌ (ఏసీసీఎఫ్‌)’ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఏడు క్యాన్సర్‌ చికిత్స కేంద్రాలను మోదీ గురువారం ప్రారంభించారు. మరో ఏడింటికి శంకుస్థాపన చేశారు. జన్‌ ఔషధి పథకం కింద క్యాన్సర్‌ రోగులకు ఔషధాలను సగం ధరకే అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. 2014తో పోలిస్తే ప్రస్తుతం దేశంలో వైద్యులు, వైద్య కళాశాలల సంఖ్య భారీగా పెరిగినట్లు వెల్లడించారు.

అందరికీ అందుబాటులో క్యాన్సర్‌ చికిత్స: రతన్‌ టాటా
ఏసీసీఎఫ్‌ కింద ఏర్పాటుచేస్తున్న కేంద్రాలతో క్యాన్సర్‌ చికిత్స అందరికీ అందుబాటులోకి వస్తుందని టాటా ట్రస్ట్‌ల ఛైర్మన్‌ రతన్‌ టాటా పేర్కొన్నారు. అస్సాంలో ఏడు చికిత్సాలయాల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. క్యాన్సర్‌ అనేది ధనికుల వ్యాధి మాత్రమే కాదని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని