Fire Accident: దిల్లీలో భారీ అగ్నిప్రమాదం

దేశ రాజధాని దిల్లీలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. దాదాపు 27 మంది సజీవదహనం అయ్యారు. మరో 12 మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో

Updated : 14 May 2022 05:12 IST

వాణిజ్య సముదాయంలో మంటలు

 27 మంది సజీవ దహనం

12 మందికి గాయాలు

మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల సాయం: పీఎంవో

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. దాదాపు 27 మంది సజీవదహనం అయ్యారు. మరో 12 మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అంటున్నారు. పశ్చిమ దిల్లీలోని ముంద్కా మెట్రోస్టేషన్‌ 544వ నంబరు స్తంభం వద్దగల మూడంతస్తుల వాణిజ్య భవనంలో ఈ ప్రమాదం చోటుచేసుకొంది. ఘటనాస్థలం నుంచి 60-70 మందిని కాపాడి బయటికి తీసుకువచ్చామని, ఇంకా కొందరు లోపలే ఉన్నట్లు రాత్రి 10.00 గంటల ప్రాంతంలో పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి, సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. కిటికీలు విరగ్గొట్టి భవనం లోపలికి ప్రవేశించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. సాయంత్రం 4.40 గంటలకు ఈ సమాచారం తమకు అందగానే, 24 అగ్నిమాపక యంత్రాలతో వెంనే చేరుకొన్నట్లు అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం మేరకు.. ఆ భవనంలో కొన్ని కంపెనీల కార్యాలయాలు ఉన్నట్లు డీసీపీ సమీర్‌ శర్మ తెలిపారు. భవనం మొదటి అంతస్తులో ఉన్న సీసీ టీవీ కెమెరా, రూటర్‌ తయారీ కంపెనీ కార్యాలయం నుంచి మంటలు మొదలయ్యాయి. ఈ కంపెనీ యజమానిని పోలీస్‌ కస్టడీలోకి తీసుకొన్నట్లు డీసీపీ వెల్లడించారు. ఈ దుర్ఘటన తనను తీవ్ర కలవరపాటుకు గురిచేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ సంతాప సందేశంలో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఆర్థికసాయం ప్రకటిస్తూ ప్రధాని కార్యాలయం ట్వీట్‌ చేసింది. 

ప్రముఖుల సంతాపం

‘దిల్లీ అగ్నిప్రమాదం చాలా విషాదకరం. మృతుల కుటుంబాలకు మా సానుభూతి.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి’ అని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తమ సంతాప సందేశాల్లో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ట్వీట్‌ చేశారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘ఈ విషాదం గురించి వినగానే దిగ్భ్రాంతికి గురయ్యా. అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నా. అగ్నిమాపక సిబ్బంది వారి జీవితాలను కాపాడేందుకు ఎంతో శ్రమిస్తున్నారు’ అని తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని