జ్ఞానవాపిలో ‘శివలింగ ప్రాంతాన్ని’ సంరక్షించండి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని జ్ఞానవాపి మసీదులో శివలింగం కనిపించిందంటున్న ప్రాంతానికి రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు మంగళవారం వారణాసి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఆ ప్రార్థనా స్థలంలో ముస్లింలు నమాజ్‌ చేసుకోవడానికి, మతపరమైన ఆచారాలు పాటించడానికి అనుమతినిచ్చింది. ఈ అంశానికి సంబంధించి వారణాసి కోర్టులో జరుగుతున్న విచారణపై స్టే విధించడానికి మాత్రం నిరాకరించింది. జ్ఞానవాపి మసీదు నిర్వహణ కమిటీ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌...

Published : 18 May 2022 05:59 IST

ముస్లింలు నమాజ్‌ చేసుకోవచ్చు
దిగువ కోర్టు విచారణపై స్టే ఇవ్వలేం
సుప్రీంకోర్టు ఆదేశాలు

దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని జ్ఞానవాపి మసీదులో శివలింగం కనిపించిందంటున్న ప్రాంతానికి రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు మంగళవారం వారణాసి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఆ ప్రార్థనా స్థలంలో ముస్లింలు నమాజ్‌ చేసుకోవడానికి, మతపరమైన ఆచారాలు పాటించడానికి అనుమతినిచ్చింది. ఈ అంశానికి సంబంధించి వారణాసి కోర్టులో జరుగుతున్న విచారణపై స్టే విధించడానికి మాత్రం నిరాకరించింది. జ్ఞానవాపి మసీదు నిర్వహణ కమిటీ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహలతో కూడిన ‘సుప్రీం’ ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. మరోవైపు, మసీదులో నిర్వహించిన వీడియోగ్రఫీ సర్వేపై నివేదిక సమర్పించేందుకు కమిషన్‌కు వారణాసి కోర్టు మరో రెండు రోజుల సమయమిచ్చింది.

జ్ఞాన్‌వాపి మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతామూర్తులకు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఐదుగురు మహిళలు దాఖలుచేసిన పిటిషన్‌ మేరకు వారణాసి కోర్టు.. ఆ ప్రార్థనా స్థలంలో వీడియోగ్రఫీ సర్వేకు ఆదేశించిన సంగతి తెలిసిందే. సర్వే కొనసాగుతుండగా సోమవారం అక్కడి వజూఖానా (నమాజ్‌కు ముందు శుద్ధికి ఉపయోగించే కొలను)లో శివలింగం కనిపించిందంటూ హిందూ పక్షం వేసిన పిటిషన్‌పై స్పందించిన న్యాయమూర్తి ఆ ప్రదేశాన్ని సీల్‌ చేయాలని, సీఆర్పీఎఫ్‌ భద్రతలో ఉంచాలని ఉత్తర్వులిచ్చారు. జ్ఞానవాపి అంశంలో వారణాసి కోర్టు ఆదేశాలు చట్టవిరుద్ధమని, అక్కడ జరుగుతున్న విచారణపై స్టే విధించాలంటూ మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. వాది, ప్రతివాదుల హక్కుల మధ్య సమతూకాన్ని పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ‘‘శివలింగం కనిపించిందని చెబుతున్న ప్రాంతాన్ని రక్షించాలన్న వారణాసి సివిల్‌ జడ్జి ఆదేశాలు.. ముస్లింల హక్కులకు అడ్డుకావు. హిందూ పక్షం తరఫు న్యాయవాది వచ్చే వరకూ ఇది తాత్కాలిక ఏర్పాటే’’ అని స్పష్టంచేసింది. హిందూ పక్షం న్యాయవాది హరిశంకర్‌ జైన్‌.. గుండె సమస్యలతో వారణాసిలోని ఆసుపత్రిలో చేరారని ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తెలిపిన నేపథ్యంలో కోర్టు ఈ ఆదేశాలిచ్చింది.

అంతకుముందు మసీదు కమిటీ పక్షాన సీనియర్‌ న్యాయవాది హుజెఫా అహ్మదీ వాదనలు వినిపించారు. ముస్లింలు వజూ (శుద్ధి) కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుందని చెప్పారు. అది లేకుంటే ఇస్లాంలో నమాజ్‌కు అర్థమే లేదన్నారు. వజూ చేపట్టే ప్రాంతంలోనే శివలింగం కనిపించినట్లు చెబుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తుషార్‌ మెహతా మాట్లాడుతూ.. ‘‘ఈ సివిల్‌ దావాలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రమేయం లేదు. వారు (ముస్లింలు) ఇంకెక్కడైనా వజూ నిర్వహించుకోవచ్చు. శివలింగం కనిపించిన ప్రాంతాన్ని మాత్రం రక్షించాల్సిన అవసరం ఉంది. ఆ ఆకృతికి ఏదైనా నష్టం వాటిల్లితే శాంతి భద్రతల సమస్య తలెత్తవచ్చు’’ అని పేర్కొన్నారు.

జ్ఞానవాపి అంశంలో వారణాసి సివిల్‌ జడ్జి రాజ్యాంగవిరుద్ధమైన అనేక ఉత్తర్వులు ఇచ్చారని అహ్మదీ పేర్కొన్నారు. ఈ అంశం ఇప్పుడు సుప్రీం కోర్టుకు చేరినందున దిగువ న్యాయస్థానంలోని విచారణపై స్టే విధించాలని కోరారు. దీనికి నిరాకరించిన ధర్మాసనం.. ‘‘ఏ న్యాయాధికారైనా మా ఉత్తర్వుల భావాన్ని అర్థం చేసుకోగలరు. స్టే అవసరం లేదు’’ అని పేర్కొన్నారు.  ఈ అంశంపై స్పందన తెలియజేయాలని హిందూ పక్షానికి నోటీసులు జారీ చేశారు. కేసు విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు. జ్ఞానవాపి మసీదు అంశాన్ని విచారించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహలకు అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు కేసుతోనూ సంబంధం ఉంది. అయోధ్య కేసుపై 2019 నవంబర్‌ 9న తీర్పు వెలువరించిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్‌ చంద్రచూడ్‌ ఉన్నారు. అప్పట్లో సీనియర్‌ న్యాయవాదిగా ఉన్న పి.ఎస్‌.నరసింహ.. ఆ దావాలో హిందూ పక్షం తరఫున వాదనలు వినిపించారు.


అడ్వకేట్‌ కమిషనర్‌ అజయ్‌మిశ్ర తొలగింపు
సర్వే నివేదిక దాఖలుకు మరో రెండు రోజులు గడువు

ఈనాడు, లఖ్‌నవూ: జ్ఞానవాపి మసీˆదు కేసు విచారణ సందర్భంగా వారణాసి సివిల్‌ కోర్టు జడ్జి రవి కుమార్‌ దివాకర్‌ కీలక ఉత్తర్వులిచ్చారు. మసీˆదు ప్రాంగణంలో వీడియోగ్రఫీˆ సర్వే కోసం కోర్టు నియమించిన అడ్వకేట్‌ కమిషనర్‌ అజయ్‌ మిశ్రకు ఉద్వాసన పలికారు. సర్వేకు సంబంధించిన సమాచారాన్ని మీడియాకు లీక్‌ చేశారన్న ఆరోపణలపై ఈ చర్య చేపట్టారు. సర్వే నివేదిక సమర్పణకు మరో రెండు రోజులు గడువిచ్చారు. తొలుత నిర్దేశించిన ప్రకారమైతే మంగళవారమే దాన్ని కోర్టుకు సమర్పించాల్సింది. అయితే నివేదిక సగమే పూర్తయిందని అడ్వకేట్‌ కమిషనర్‌ పేర్కొన్న నేపథ్యంలో గడువును ఈ నెల 19 వరకూ న్యాయమూర్తి పొడిగించారు.

కోర్టు నియమించిన ప్రత్యేక అడ్వకేట్‌ కమిషనర్‌ విశాల్‌ సింగ్‌ దాఖలు చేసిన దరఖాస్తు మేరకు మిశ్రను న్యాయమూర్తి తొలగించారు. మిశ్ర తనకు సహకరించడంలేదని, వీడియోగ్రఫీ సర్వే కోసం ఆయన నియమించిన వ్యక్తిగత ఫొటోగ్రాఫర్‌.. నిత్యం మీడియాకు తప్పుడు సమాచారం ఇస్తున్నాడని ఆయన చెప్పారు. దీన్ని జడ్జి తన ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. అడ్వకేట్‌ కమిషనర్‌ పబ్లిక్‌ సర్వెంట్‌ హోదాలో ఉన్నారని చెప్పారు. ఆయన నిజాయితీగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని చెప్పారు. అయితే మిశ్ర బాధ్యతారహితంగా వ్యవహరించారన్నారు. మే 12 తర్వాత కమిషన్‌ సాగించిన కసరత్తును కోర్టుకు విశాల్‌ సింగ్‌ సమర్పించాలని పేర్కొంది.

జ్ఞానవాపి అంశంపై తొలుత పిటిషన్‌ వేసిన ఐదుగురు మహిళలు మంగళవారం మరోసారి వారణాసి కోర్టును ఆశ్రయించారు. పక్కనే ఉన్న కాశీ విశ్వనాథుడి ఆలయంలో నంది విగ్రహానికి అభిముఖంగా ఉన్న తాత్కాలిక గోడను తొలగించాలని, తద్వారా జ్ఞానవాపి మసీదులో తాజాగా వెలుగు చూసిన శివలింగం వీక్షణకు వీలు కలుగుతుందన్నారు. ఇందుకోసం మరోసారి సర్వే చేపట్టాలని కోరారు. దీనిపై బుధవారం వాదనలు వింటామని న్యాయమూర్తి పేర్కొన్నట్లు పిటిషనర్ల తరఫు న్యాయవాది చెప్పారు.


మథురలోని ఈద్గా కేసు తెరపైకి..
జ్ఞానవాపి తరువాత ఊపందుకున్న శ్రీకృష్ణ జన్మభూమి వ్యవహారం

ఈనాడు, లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జ్ఞానవాపి మసీˆదు కేసు తరువాత ఇప్పుడు మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి వ్యవహారం తెరపైకి వచ్చింది. జ్ఞానవాపి మసీˆదుపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. మథురలోని శ్రీకృష్ణ జన్మస్థలం సమీపంలో ఉన్న ప్రసిద్ధ షాహీ ఈద్గా మసీదుకు సీల్‌ వేయాలన్న పిటిషన్‌ను అక్కడి సివిల్‌ న్యాయస్థానం స్వీకరించింది. శ్రీకృష్ణ జన్మభూమి ఆలయానికి ఆనుకుని ఉన్న  షాహీ ఈద్గా  మసీదు భద్రతను పెంచడంతోపాటు అక్కడి రాకపోకలను నిషేధించాలని, సెక్యూరిటీ అధికారిని నియమించాలని పిటిషన్‌లో డిమాండ్‌ చేశారు. దీనిపై విచారణను జులై 1కి న్యాయస్థానం వాయిదా వేసింది. మథురలోని 13.37 ఎకరాల భూమి యాజమాన్యంపై ఇప్పటికే సివిల్‌ కోర్టులో కేసు నడుస్తోంది. ఈ భూమిలో 11 ఎకరాలు దేవాలయం సమీపంలోను, మిగిలిన భూమి ఈద్గా సమీపంలోను ఉంది. కొన్నిరోజుల కిందట శ్రీకృష్ణ జన్మభూమి కేసును విచారించిన హైకోర్టు నాలుగునెలల్లో దరఖాస్తులన్నింటిని పరిష్కరించాలని ఆదేశించింది. దీంతోపాటు వివాదాస్పద స్థల సమస్యను కూడా పరిశీలించాలని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని