పేరరివాళన్‌ను విడుదల చేయండి

రాజీవ్‌ గాంధీ హత్యకేసులో 30 ఏళ్లపాటు జైలుశిక్ష అనుభవించిన ఏజీ పేరరివాళన్‌ను విడుదల చేయాలని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. ఈ విషయంలో రాజ్యాంగంలోని 142వ అధికరణం కింద

Published : 19 May 2022 05:27 IST

రాజీవ్‌ గాంధీ హత్యకేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు

దిల్లీ: రాజీవ్‌ గాంధీ హత్యకేసులో 30 ఏళ్లపాటు జైలుశిక్ష అనుభవించిన ఏజీ పేరరివాళన్‌ను విడుదల చేయాలని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. ఈ విషయంలో రాజ్యాంగంలోని 142వ అధికరణం కింద తమకున్న అసాధారణ అధికారాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఉపయోగించుకుంది. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులను విడుదల చేయాలని తమిళనాడు రాష్ట్ర మంత్రివర్గం ఇచ్చిన సలహా ఆ రాష్ట్ర గవర్నర్‌ నిర్ణయానికి లోబడి ఉంటుందని జస్టిస్‌ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఐపీసీ సెక్షన్‌ 302 కేసులో క్షమాభిక్ష ప్రసాదించే అధికారం రాష్ట్రపతికే ఉంటుందన్న కేంద్ర ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనివల్ల 161వ అధికరణం కింద క్షమాభిక్ష ప్రసాదించే గవర్నర్‌ అధికారం పనికిరాకుండా పోతుందని వ్యాఖ్యానించింది. హత్య కేసుల్లో దోషులకు క్షమాభిక్ష ప్రసాదించే విషయంలో గవర్నర్‌కు సలహాలు ఇచ్చే, సహాయం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్నలతో కూడిన ఈ ధర్మాసనం వ్యాఖ్యానించింది.

నిర్ణయం రాష్ట్రపతిదే: కేంద్రం
పేరరివాళన్‌ క్షమాభిక్ష దరఖాస్తును రాష్ట్రపతికి పంపాలన్న తమిళనాడు గవర్నర్‌ నిర్ణయాన్ని కేంద్రం అంతకుముంద]ు సమర్థించుకుంది. కేంద్ర చట్టాల కింద దోషులుగా తేలిన వ్యక్తి దాఖలు చేసుకునే క్షమాభిక్ష, శిక్ష తగ్గింపు, శిక్ష మార్పిడి దరఖాస్తు విషయంలో రాష్ట్రపతి మాత్రమే నిర్ణయం తీసుకోగలరని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ కేఎం నటరాజ్‌ కోర్టుకు తెలిపారు.

మార్చి 9న బెయిలు మంజూరు
దీర్ఘకాలంగా జైల్లో ఉండటం, పెరోల్‌ మీద బయటకు వెళ్లినప్పుడూ ఎలాంటి ఫిర్యాదులు లేకపోవడంతో మార్చి 9న సుప్రీంకోర్టు పేరరివాళన్‌కు బెయిలు మంజూరుచేసింది. మల్టీ డిసిప్లినరీ మానిటరింగ్‌ ఏజెన్సీ (ఎండీఎంఏ) దర్యాప్తు పూర్తయ్యేవరకూ తనకు విధించిన జీవిత ఖైదును సస్పెండ్‌ చేయాలని పేరరివాళన్‌ దాఖలుచేసిన వ్యాజ్యాన్ని కూడా సుప్రీంకోర్టు విచారిస్తోంది. పేరరివాళన్‌కు శిక్ష తగ్గించే విషయంలో తమిళనాడు గవర్నర్‌ ఒక నిర్ణయం తీసుకోవాలని 2020 నవంబరు 20న సీబీఐ తన అఫిడవిట్‌లో సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే తనకు ఆ అధికారం లేదంటూ.. క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతికి గవర్నర్‌ పంపారు. అప్పటినుంచి అది పెండింగులో ఉంది. దాంతో, శిక్ష తగ్గించే అధికారం విషయం తేలేవరకూ దోషికి బెయిలు మంజూరు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.

* తనను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసి.. పేరరివాళన్‌ డప్పు వాయించి సంబరాలు చేసుకున్నాడు.

పేరరివాళన్‌ విడుదలకు అతడి తల్లి అర్పుదమ్మాళ్‌ 3 దశాబ్దాలపాటు అలుపెరుగని పోరాటం చేశారు. అతడికి అండగా నిలవాలని కోరుతూ పలు సందర్భాల్లో తమిళనాడు సీఎంలను కలిశారు. సుప్రీం తీర్పును తమిళనాట అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకే, పీఎంకే తదితర పార్టీలు  స్వాగతించాయి.

పేరరివాళన్‌ విడుదలపై కాంగ్రెస్‌ తీవ్ర నిరాశ వ్యక్తం చేసింది. సుప్రీం తాజా ఆదేశాలు తమకు బాధ కలిగించాయని పేర్కొంది. మాజీ ప్రధానిని చంపిన వ్యక్తి విడుదలయ్యే పరిస్థితులను సృష్టించడం ద్వారా భాజపా చౌకబారు రాజకీయాలకు పాల్పడిందని విమర్శించింది.

తొలి ఆత్మాహుతి దాడి
1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ధాను అనే మహిళా ఆత్మాహుతిదళ సభ్యురాలు తనను తాను బాంబుతో పేల్చేసుకోవడంతో రాజీవ్‌గాంధీ మరణించారు. ఈ ఘటనలో రాజీవ్‌ కాక.. ధాను సహా మొత్తం 14 మంది మరణించారు. అత్యున్నత స్థాయి వ్యక్తిని హతమార్చేందుకు ఇలా ఆత్మాహుతి దాడి చేసిన ఘటన దేశంలో అదే మొదటిది.

* 1999 మే నెలలో ఇచ్చిన ఉత్తర్వులలో పేరరివాళన్‌, మురుగన్‌, శాంతన్‌, నళిని అనే నలుగురు దోషులకు విధించిన మరణశిక్షను సుప్రీంకోర్టు ఖరారుచేసింది.

* 2014 ఫిబ్రవరి 18న పేరరివాళన్‌, మరో ఇద్దరు దోషులు శాంతన్‌, మురుగన్‌లకు విధించిన మరణశిక్షను సుప్రీంకోర్టు జీవితఖైదుగా మార్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని