Azadi Ka Amrit Mahotsav: ఆంగ్లేయులతో పాదరసంలా..

ఆంగ్లేయులు అవమానిస్తే ఆగ్రహంతో కొలువులు వదులుకొని... కసితో జాతీయోద్యమంలోకి దూకిన వారు ఎందరో! కానీ... భారతావని అభివృద్ధి కోసం  ఆంగ్లేయులతోనే ఉంటూ... వారి సదుపాయాలు వాడుకుంటూ... వాదించి... నిలదీసి సాధించిన అసమాన యోధుడు.... భారత రసాయనశాస్త్ర పితామహుడు..

Updated : 21 May 2022 05:59 IST

ఆంగ్లేయులు అవమానిస్తే ఆగ్రహంతో కొలువులు వదులుకొని... కసితో జాతీయోద్యమంలోకి దూకిన వారు ఎందరో! కానీ... భారతావని అభివృద్ధి కోసం  ఆంగ్లేయులతోనే ఉంటూ... వారి సదుపాయాలు వాడుకుంటూ... వాదించి... నిలదీసి సాధించిన అసమాన యోధుడు.... భారత రసాయనశాస్త్ర పితామహుడు... పారిశ్రామిక దార్శనికుడు... ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే!

రారులి కథిపరా (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది)లో 1861లో సంపన్న జమీందారీ కుటుంబంలో జన్మించారు ఆచార్య రే. సాహిత్యం, చరిత్రలపై మక్కువ ఉన్నా... దేశ ప్రగతికి కీలకమైన శాస్త్రసాంకేతిక రంగాలపై దృష్టి సారించాలనుకున్నారు. ఇంగ్లండ్‌లోని ఎడిన్‌బరో విశ్వవిద్యాలయంలో చేరారు. బ్రిటన్‌కు వెళ్లి, ఆంగ్లేయులతో కలసి... వారి కళాశాలలో చదువుతున్నా ఎన్నడూ భారతీయతను వదులుకోలేదు. తెల్లవారి తప్పులను ఎత్తి చూపటంలో భయపడలేదు. కాలేజీలో ఓసారి ‘సిపాయిల తిరుగుబాటుకు ముందూ... తర్వాత భారత్‌’ అనే అంశంపై వ్యాస రచన పోటీ పెట్టారు. నిర్భయంగా బ్రిటిష్‌ పాలనపై దుమ్మెత్తి పోశారు రే. ‘‘భారతీయుల ప్రస్తుత దుస్థితికి ఇంగ్లాండ్‌ పాలకుల నిర్లక్ష్యమే కారణం. తెల్ల ఏనుగుల్లాంటి భవనాలపై కోట్ల పౌండ్లు తగలేస్తున్న సర్కారుకు...  ప్రయోగశాలలకు డబ్బులివ్వటానికి చేతులు రావటం లేదు. భారత్‌లో బ్రిటిష్‌ ప్రభుత్వం పన్నులు పిండే వ్యవస్థ మాత్రమే. ప్రజల్ని పాలించేది కాదు’’ ఇలా సాగింది ఆయన వ్యాసం. ఇంగ్లాండ్‌లోనే మంచి ఉద్యోగం, పరిశోధనకు అవకాశం ఉన్నా 1888లో ఆయన భారత్‌కు తిరిగివచ్చారు.

జాతీయోద్యమంలో దిగి... ఆందోళనల్లో పాల్గొనాలని ఆయన కోరుకోలేదు. ‘‘సైన్స్‌ ద్వారానే... నా దేశానికి సేవ చేస్తా’’ అంటూ ప్రతిన పూనిన ఆయన ఆ దిశగా రాజకీయ ఉద్యమకారులకంటే ఉద్ధృతంగా కదిలారు. కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరారు. ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటూనే... ఆంగ్లేయులతో కలసి భారత విజ్ఞాన శాస్త్ర పునరుద్ధరణకు రే ప్రయత్నించారు. కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో జరిగిన ఓ సంఘటన అందుకు చక్కని ఉదాహరణ. శాస్త్రవేత్త జగదీశ్‌ చంద్రబోస్‌ ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రొఫెసర్‌గా చేసేవారు. అక్కడి ప్రయోగశాల సకల సదుపాయాలతో ఉండేది. ఓరోజు బోస్‌ గురువు... లార్డ్‌ రేలీ కాలేజీని సందర్శించారు. ప్రయోగశాలను చూసివెళ్లారు. తనకు తెలియకుండా బయటి వ్యక్తిని ప్రయోగశాలలోకి ఎలా రానిచ్చారంటూ కాలేజీ ప్రిన్సిపల్‌ ఆగ్రహం వ్యక్తంజేశారు. ఆవేదనతో జగదీశ్‌ చంద్రబోస్‌ రాజీనామాకు సిద్ధపడ్డారు. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ కూడా ఆయనకు మద్దతిచ్చారు. కాలేజీ నుంచి బయటకొస్తే త్రిపుర మహారాజు సాయంతో మరో ప్రయోగశాల పెట్టిస్తానంటూ హామీ ఇచ్చారు. ఆచార్య రే మాత్రం... బోస్‌ను తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని హెచ్చరించారు. ‘‘కొత్తగా ఏర్పాటు చేసే ప్రయోగశాలలో ఇన్ని సదుపాయాలు కల్పించటం అంత సులభం కాదు. పైగా... ఈ ప్రెసిడెన్సీ కాలేజీ ప్రయోగశాల మన భారతీయుల డబ్బుతో ఏర్పాటైంది. మనవాళ్ల ముక్కు పిండి వసూలు చేసిన పన్నులతో కట్టింది. ఇది మన ఆస్తి. ప్రిన్సిపల్‌ ఏదో అన్నాడని... రాజీనామా చేయడం తగదు’’ అంటూ నచ్చజెప్పారు. బోస్‌నే కాదు... మేఘనాథ్‌ సాహా, శాంతిస్వరూప్‌ భట్నాగర్‌లాంటి అనేక మంది భారతీయ యువకులనూ పరిశోధనల వైపు మళ్లించారు ఆచార్య రే. అంతగా ప్రతిభలేని ఆంగ్లేయులకు కాలేజీల్లో ఎక్కువ జీతాలిస్తూ... భారతీయులకు తక్కువ జీతాలివ్వటాన్ని ఆయన నిలదీసేవారు. తమనెంతగా విమర్శించినా... ఆయన ప్రతిభ, పరిశోధనలను దృష్టిలో ఉంచుకొని బ్రిటిష్‌ సర్కారు చూసీ చూడనట్లుగా విడిచిపెట్టింది.

రసాయన శాస్త్రంలో ప్రఫుల్ల చంద్ర రే 107 పరిశోధన పత్రాలు సమర్పించారు. పాదరసం, దాని మిశ్రమాలపై ఆయన చేసిన పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. భారత్‌ను పారిశ్రామికంగా, సాంకేతికంగా ముందంజలో ఉంచటానికి కృషి చేశారు. మనదేశంలో తొలి రసాయన శాస్త్ర పరిశోధనశాలను ఏర్పాటు చేశారు. ఆంగ్లేయులకు దీటుగా మొదటి ఔషధ కంపెనీ ఆరంభించారు. 1901లో ఓ చిన్న అద్దె ఇంట్లో రూ.700 పెట్టుబడితో బెంగాల్‌ కెమికల్‌ అండ్‌ ఫార్మాసూటికల్‌ వర్క్స్‌ లిమిటెడ్‌ కంపెనీని ఆరంభించారు. విదేశాల నుంచి దిగుమతయ్యే మందులు, శస్త్రచికిత్స పరికరాలు, టాల్కమ్‌ పౌడర్లు, టూత్‌పేస్టు, సబ్బులను నాణ్యంగా, తక్కువ ధరలకు ఇక్కడే తయారు చేసేవారు. తమ ఊరిలో ఒకే ఒక స్టీమర్‌తో ఓ కంపెనీ కూడా ఏర్పాటు చేశారు.
సహాయ నిరాకరణ ఉద్యమానికి ఆచార్య రే మద్దతిచ్చారు. తన ఆరోగ్యం సహకరించకున్నా నేషనల్‌ స్కూల్స్‌ ఏర్పాటు, ఖద్దరు వాడకం, అంటరానితనం నిర్మూలనకు కృషి చేశారు. గాంధీని, సుభాష్‌నే కాదు... విప్లవవాదులను కూడా అభిమానించిన ఆచార్య రే... బెంగాల్‌ విప్లవకారులకు రహస్యంగా సాయం చేశారు. 60 ఏళ్లు నిండగానే తన భవిష్యత్‌ జీతాన్నంతటినీ రసాయనశాస్త్ర పరిశోధనలకు రాసిచ్చారు. 75 ఏట రిటైరయ్యారు. 1944 జూన్‌ 16న కన్నుమూశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని