Updated : 21 May 2022 06:13 IST

పదవీకాలం కనీసం 7 ఏళ్లు ఉండాలి

 అప్పుడే సుప్రీంకోర్టు జడ్జీలు ఉత్తమ పనితీరు కనబరుస్తారు 

 నిర్ణయాధికారం ఉన్నవారు దీనిపై ఆలోచించాలి 

 జస్టిస్‌ లావు నాగేశ్వరరావు సూచన 

ఈనాడు, దిల్లీ: దేశ సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తులుగా బాధ్యతలు చేపట్టేవారికి కనీసం 7-8 ఏళ్ల పదవీకాలం ఉండాలని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. అప్పుడే వారు ఉత్తమ పనితీరు కనబర్చగలరని పేర్కొన్నారు. అత్యున్నత న్యాయస్థానం జడ్జీల పదవీ విరమణ వయసు 65 ఏళ్లుగా ఉండటమంటే.. వారు తక్కువ వయసులో నిష్క్రమిస్తున్నట్లేనని వ్యాఖ్యానించారు. అవకాశముంటే జీవితాంతం న్యాయవాదిగా కొనసాగేందుకు తాను ఇష్టపడతానని చెప్పారు. తాను వచ్చే నెల 7న పదవీ విరమణ చేయనుండటంతో.. తన గౌరవార్థం సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ శుక్రవారం ఏర్పాటుచేసిన వీడ్కోలు కార్యక్రమంలో జస్టిస్‌ నాగేశ్వరరావు ఈ మేరకు పలు కీలక అంశాలపై మాట్లాడారు. తన అనుభవాలను అందరితో పంచుకున్నారు. ఆయన ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే..  హైకోర్టుల్లో 15-17 ఏళ్లు న్యాయమూర్తులుగా పనిచేసి సుప్రీంకోర్టుకు పదోన్నతిపై వచ్చేవారికి సగటున 4-5 ఏళ్ల పదవీకాలం మాత్రమే ఉంటుంది. ఇక్కడి పనితీరుకు అలవాటుపడటానికి వారికి రెండేళ్లు పడుతుంది. క్రమంగా అన్నింటినీ అర్థం చేసుకొని పూర్తిస్థాయిలో పనిచేయడం మొదలుపెట్టాక పదవీ విరమణ వయసు వచ్చేస్తుంది. పలువురు గతంలో న్యాయవాదులుగా పనిచేసినప్పటికీ.. తీర్పులు చెప్పడమనేది పూర్తిగా విభిన్నమైన కళ. అందులో పూర్తిస్థాయిలో ఆరితేరడానికి 3-4 ఏళ్ల సమయం పడుతుంది. కాబట్టి సుప్రీంకోర్టుకు వచ్చే న్యాయమూర్తులకు కనీసం 7-8 ఏళ్ల పదవీకాలం ఉండేలా చూడాలి. అప్పుడే వారు ఉత్తమ పనితీరు ప్రదర్శిస్తారు. నేనిక్కడ ఆరేళ్లుగా ఉన్నాను. ప్రతిరోజు కోర్టు వ్యవహారాలపై పట్టు పెంచుకున్నాను. సౌకర్యవంతంగా ఉండే స్థితికి రాగానే.. వెళ్లిపోతున్నాను. నిర్ణయాధికారం ఉన్నవారు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. పదవీకాలం ఎక్కువ ఉన్నవారిని ఇక్కడ న్యాయమూర్తిగా తీసుకోవాలి. 

2014లోనే అవకాశం వచ్చినా.. 

నేను దిల్లీకి మకాం మార్చేటప్పుడు మా కుటుంబసభ్యులతోపాటు స్నేహితుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అంతా బాగున్న హైకోర్టును వదులుకొని సుప్రీంకోర్టుకు వెళ్లడం ఎందుకని వారు ప్రశ్నించారు. అయితే మనం సవాళ్లను స్వీకరించకపోతే విజయం సాధించలేం. ఈ విషయాన్ని యువత గుర్తించాలి. సర్వోన్నత న్యాయస్థానంలో ప్రాక్టీస్‌ చేయాలన్న ఆలోచనే సవాల్‌తో కూడుకున్నది. కలలను సాకారం చేసుకోవాలంటే కష్టపడి పనిచేయాలి. నేను ఈ కోర్టుకు వచ్చేటప్పుడు ఇదే నా చివరి ప్రయాణం అనుకున్నాను. ఇక్కడ రాత్రింబవళ్లు శ్రమించి.. 60-65 ఏళ్లకు మళ్లీ హైదరాబాద్‌కు వెనక్కి వెళ్లి సమాజంలోని పేద పిల్లలకు సాయం చేయాలనుకున్నాను. 2014లో అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఆర్‌.ఎం.లోధా నాకు న్యాయమూర్తి పదవి ఇవ్వజూపారు. నేను తొలుత అంగీకరించాను. తర్వాత నా నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాను. అప్పటికే నేను చాలామంది పేద పిల్లల చదువులకు సాయం చేస్తున్నాను. సొంత ఊరిలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతున్నాను. వాటన్నింటినీ వదిలేయాల్సి వస్తుందన్న కారణంతోనే ఆ ఆఫర్‌ను తిరస్కరించాను. జస్టిస్‌ లోధా నా నిర్ణయాన్ని గౌరవించారు. 2016లో అప్పటి సీజేఐ జస్టిస్‌ టి.ఎస్‌.ఠాకుర్‌ నన్ను వారి ఇంటికి పిలిచి.. న్యాయమూర్తి పదవి చేపట్టాలని కోరారు. ‘రెండేళ్ల క్రితం అంగీకరించి వద్దాన్నావు. అప్పట్లో కారణంగా చూపిన బాధ్యతలను తీర్చడానికి అవసరమైన డబ్బును ఇప్పుడు సంపాదించావు. కాబట్టి ఈసారి కచ్చితంగా అంగీకరించాల్సిందే’ అని పట్టుబట్టారు. ఇంట్లో మాట్లాడి చెబుతానన్నా ఆయన వినలేదు. నాకు సమయం ఇస్తే ఒప్పుకోనేమోనని ఆయన భావించారు. ‘‘నీవు 60-65 ఏళ్లకు వెనక్కి వెళ్లిపోవాలనుకుంటున్నావు కదా.. ఇప్పుడు న్యాయమూర్తి పదవి చేపడితే 65 ఏళ్లకు కచ్చితంగా బయటికెళ్లాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని స్వీకరించు’ అని జస్టిస్‌ ఠాకుర్‌ కోరారు. అలా తప్పనిసరి పరిస్థితుల్లో న్యాయమూర్తి పదవి స్వీకరించడానికి నేను అంగీకరించాను. 

న్యాయవాదిలా ఆలోచించా..

 నాకు ఈ వృత్తి.. జీవితంలో అన్నింటినీ ఇచ్చింది. న్యాయవాదిగా ఉండటానికి ఎప్పుడూ ఇష్టపడతాను. న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఓసారి.. ‘నేను ఇప్పటికీ న్యాయవాదిగానే ఆలోచిస్తున్నానుతప్ప న్యాయమూర్తిలా కాదు’ అని ధర్మాసనంపై కలిసి కూర్చున్న అప్పటి న్యాయమూర్తి జస్టిస్‌ గొగొయితో అన్నాను. అందుకు ఆయన స్పందిస్తూ.. ‘నీవు న్యాయవాది తరహాలోనే ఆలోచించు. దానివల్ల న్యాయవాదులను మరింత మెరుగ్గా అర్థం చేసుకోవచ్చు’ అన్నారు. జస్టిస్‌ గొగొయితో అన్న మాటలు నిన్న కోర్టులో కూర్చున్నప్పుడు కూడా నాకు గుర్తొచ్చాయి. నేను 22 ఏళ్లు బార్‌ సభ్యుడిగా ఉన్నాను. మీరు చూపిన ప్రేమ, ఆప్యాయత.. నా విధి నిర్వహణను చాలా సులభతరం చేశాయి. ఈ రోజుక్కూడా నేను ఇటువైపు (ధర్మాసనం) కంటే అటువైపే (న్యాయవాదులు) మేలని అనుకుంటున్నాను. అవకాశముంటే జీవితాంతం న్యాయవాదిగా కొనసాగుతాను. దిల్లీకొచ్చి ప్రాక్టీస్‌ మొదలుపెట్టిన తర్వాత ఎదురైన ఇబ్బందులన్నీ గుర్తున్నాయి. ఇది ఎంతో అద్భుతమైన ప్రయాణం. సహచర న్యాయవాదులు, న్యాయమూర్తుల నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఈ కోర్టులో నేను కఠినంగా వ్యవహరించి ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమాపణలు కోరుతున్నాను. 

వృత్తి జీవితంలో నటన భాగం 

 యుక్త వయస్సులో ఉన్నప్పుడు దర్శకుడిగా ఉన్న సోదరుడు నటించమని కోరడంతో ఒక సినిమాలో నటించాను. తర్వాత ఆపేశాను. కోర్టుల్లో వాదనలు వేడెక్కినప్పుడు న్యాయవాదుల మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించే సమయంలో కొంత నటించాల్సి వస్తుంది. కాబట్టి వృత్తి జీవితంలో నటన అంతర్భాగం. క్రికెట్‌ నాకు ఇష్టమైన క్రీడ. నేను పనిచేసుకుంటున్నప్పుడు కూడా టీవీలో ఐపీఎల్‌ మ్యాచ్‌ నడుస్తూ ఉండాల్సిందే. అది జీవితంలో భాగంగా మారింది. పదేళ్ల నుంచి గోల్ఫ్‌ అలవాటైంది. క్రీడలు నాకు జీవితంలో ఎన్నో నేర్పాయి. 

కష్టపడితేనే ముందుకు.. 

అసాధారణ మేధస్సు, వేగంగా అన్నింటినీ అర్థం చేసుకొనే సామర్థ్యాలు నాకున్నాయని చెప్పను. నేను సాధారణ తెలివితేటలున్న వ్యక్తిని. ‘కష్టపడి పనిచేస్తే ఉన్నత స్థానానికి చేరుకుంటావు’ అని మా స్వరాష్ట్రానికి చెందిన దివంగత సీనియర్‌ న్యాయవాది పీపీ రావు ఓసారి నాతో చెప్పారు. ఆ మాట నాపై బాగా పనిచేసింది. న్యాయవాదులే రాజ్యాంగ కాపలాదారులు. బలమైన బార్‌ ఉన్నప్పుడే దాని సహకారంతో న్యాయమూర్తులు న్యాయం చేయగలుగుతారు. పౌరహక్కుల గురించి న్యాయవాదులు గొంతెత్తకపోతే.. దాని గురించి ఎక్కడా వినిపించుకొనే పరిస్థితి ఉండదు. ఇప్పటివరకూ పౌరుల హక్కులను కాపాడటంలో సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చింది. బార్‌ వల్ల నేను ఎంతో ప్రయోజనం పొందాను. నేను మిగతావారిలా 15-20 ఏళ్లు న్యాయమూర్తిగా పనిచేయలేదు. కాబట్టి పనిచేస్తూనే నేర్చుకున్నాను.  

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts