Published : 22 May 2022 04:35 IST

స్వదేశీ హైపర్‌లూప్‌ రవాణా

పదేళ్లలో మన దేశంలో అందుబాటులోకి!
కసరత్తు మొదలుపెట్టిన ఐఐటీ-ఎం విద్యార్థులు
వెన్నుదన్నుగా నిలుస్తున్న రైల్వే

ఈనాడు, చెన్నై: అత్యంత వేగవంతమైన ఉపరితల రవాణా.. హైపర్‌లూప్‌. ఆర్థికంగా బలమైన దేశాలన్నీ ఇప్పుడు ఆ సాంకేతికతపై భారీగా నిధులు ఖర్చు పెడుతున్నాయి. వాటికి భిన్నంగా... తక్కువ ఖర్చుతోః్న సుస్థిర ‘హైపర్‌లూప్‌’ సాంకేతికతను రూపొందించేందుకు ఐఐటీ-మద్రాసు విద్యార్థులు మార్గం సుగమం చేశారు. రవాణా కోసం వాడే ‘వాక్యూమ్‌ ట్యూబ్‌’పై పేటెంట్‌ పొందారు. ఇలాంటి స్వదేశీ సాంకేతికతే తమకు అవసరమని రైల్వేశాఖ వీరికి అండగా నిలిచింది. పదేళ్లలోపు ఈ ప్రాజెక్టును కార్యరూపం దాల్చేలా లక్ష్యాల్ని నిర్దేశించింది.

విమానాన్ని మించిన వేగం, పట్టాలను తాకకుండా సర్రున జారుతూ కంటికి కనిపించనంతగా అయస్కాంత శక్తి సాయం... ఇవి రెండూ కలగలిపి హైపర్‌లూప్‌ ఉంటుంది. దీనికోసం పనిచేసి విజయవంతమైన నమూనా హైపర్‌లూప్‌ను ఆవిష్కరించి ఐఐటీ మద్రాస్‌ విద్యార్థులు శెభాష్‌ అనిపించుకున్నారు. తాజాగా రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఈ విద్యార్థులతో సమావేశమయ్యారు. దేశానికి ఈ కొత్త రవాణా సదుపాయాన్ని అందించే బాధ్యతను వీరికే అప్పగించారు. ప్రాజెక్టులో భాగంగా రూ.8.34 కోట్లను మంజూరు చేశారు.

తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం
ఐఐటీ మద్రాస్‌లోని 70 మంది సాంకేతిక విద్యార్థుల బృందంతో పనిచేసే ‘ఆవిష్కార్‌’ టీమ్‌.. ఈ హైపర్‌లూప్‌ ప్రాజెక్టును తెచ్చింది. వీరి అంచనా ప్రకారం 8-10 ఏళ్లలో ప్రయాణానికి సిద్ధం చేయొచ్చు. పూర్తిగా విద్యుత్తుతో పనిచేసే ఈ వ్యవస్థను తక్కువ విద్యుత్తుతోనే నడిపించడం, ప్రయాణ మార్గం వెంబడి సౌర విద్యుత్తును అందిపుచ్చుకోవడం, వీలైనంత తక్కువ నిర్వహణ ఉండేలా చూడటం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుగు విద్యార్థిని మేధ కొమ్మాజోస్యుల తెలిపారు. ఇది పర్యావరణానికి ఏమాత్రం హాని కలగజేయదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కోరిన మేరకు కిలోమీటరుకు ఎంత ఖర్చవుతుందో ఓ అంచనాకు వచ్చేందుకు విద్యార్థులు కృషి చేస్తున్నారు.

ఇవీ ప్రాజెక్టు ప్రత్యేకతలు...
*
రక్షణశాఖ నిబంధనల మేరకు అత్యంత భద్రతతో ప్రాజెక్టును డిజైన్‌ చేస్తున్నారు. ప్రయాణాలతోపాటు అత్యంత వేగంగా సరకు రవాణానూ సవాలుగా తీసుకుని పనిచేస్తున్నారు.
* గంటకు 1200 కి.మీ. వేగంతో ప్రయాణించే సాంకేతికత తమ దగ్గర ఉందని విద్యార్థులు చెబుతున్నారు. దేశంలో ఎక్కడికైనా అరగంట నుంచి గంటన్నర, రెండు గంటల్లోపు వెళ్లేలా డిజైన్‌ చేస్తున్నారు.
* ఈ రవాణాకు వాడే వాక్యూమ్‌ ట్యూబ్‌లో గాలి చొరబాటును, లీకేజీల్ని ఎంత తగ్గిస్తే అంత వేగం పెంచుకోవచ్చు. పట్టాల ఉపరితలాన్ని తాకకుండా అయస్కాంత సాంకేతికత, సమర్థంగా బ్రేకులు పడేలా మాగ్నెటిక్‌ బ్రేకింగ్‌ వ్యవస్థను తీసుకొచ్చారు. ఇదో గొప్ప విజయమని ప్రాజెక్టు హెడ్‌ భారత్‌ భావసర్‌ చెబుతున్నారు.

ఎలాన్‌ మస్క్‌ స్ఫూర్తితో...
స్పేస్‌ఎక్స్‌ వ్యవస్థాపకుడు ఎలాన్‌మస్క్‌ 2013లోనే ‘హైపర్‌లూప్‌ ఆల్ఫా’ పేరుతో ఈ ఆలోచనను తెచ్చారు. ఆ స్ఫూర్తితోనే ఐఐటీ మద్రాస్‌ విద్యార్థులు ఇప్పటిదాకా రెండు ప్రొటోటైప్‌ హైపర్‌లూప్‌లను రూపొందించారు. యూరోపియన్‌ హైపర్‌లూప్‌ వీక్‌-2021 పోటీల్లో వీరికి ‘మోస్ట్‌ స్కేలబుల్‌ డిజైన్‌’ అవార్డు దక్కింది. వీరి డిజైన్‌కు గతేడాది ఆగస్టులో పేటెంట్‌ వచ్చింది. ఇప్పుడు ఐఐటీ మద్రాస్‌ క్యాంపస్‌లో 2 మీటర్ల వ్యాసంతో 500 మీటర్ల పొడవుండే వాక్యూమ్‌ ట్యూబ్‌ను నిర్మించబోతున్నారు. ఇది ప్రపంచంలోనే తొలి విద్యార్థుల ప్రయోగశాల. దీని ద్వారానే స్వదేశీ హైపర్‌లూప్‌ను దేశానికి ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా రైల్వే అధికారులకు సైతం శిక్షణ ఇచ్చేలా ఐఐటీ మద్రాస్‌తో రైల్వేశాఖ ఒప్పందం కుదుర్చుకుంటోంది. ఇప్పటికే ఆవిష్కార్‌ టీమ్‌కు ఎల్‌అండ్‌టీ, డెలాయిట్‌ లాంటి సంస్థల నుంచి సహకారం అందుతోంది.

పరిశోధక బృందంలో తెలుగువారు
పూజిత బలభద్ర, మేధ కొమ్మాజోస్యుల, పి.నిఖిల్‌, సాత్విక్‌ కొమ్మ, ప్రఖత్‌ అగర్వాల్‌, స్నేహారెడ్డి.పి (హైదరాబాద్‌), శివనాగ త్రిశూల్‌ కింపరాజు (కర్నూలు), ఉదయ్‌కృష్ణ కాళ్లకూరి (కృష్ణ), సాయిసాత్విక్‌ పుట్రేవు (విశాఖపట్నం), జయకర్‌ రెడ్డి.ఎ తదితరులు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని