క్వాడ్‌ సదస్సు వేళ.. బైడెన్‌తో మోదీ కీలక భేటీ

భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌ కలిసి ఏర్పాటు చేసిన క్వాడ్‌ కూటమి చైనాలో గుబులు రేపుతోందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. జపాన్‌లో జరిగే ఈ నాలుగు దేశాల కూటమిలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం బయల్దేరే ముందు డ్రాగన్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. బీజింగ్‌ను కట్టడి చేసేందుకు ఏర్పాటు చేసిన ఈ కూటమి విఫలమవ్వడం ఖాయమని పేర్కొంది.

Published : 23 May 2022 04:49 IST

చైనా కట్టడే ప్రధాన ఎజెండా

2 రోజుల జపాన్‌ పర్యటనకు బయల్దేరిన ప్రధాని

దిల్లీ: భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌ కలిసి ఏర్పాటు చేసిన క్వాడ్‌ కూటమి చైనాలో గుబులు రేపుతోందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. జపాన్‌లో జరిగే ఈ నాలుగు దేశాల కూటమిలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం బయల్దేరే ముందు డ్రాగన్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. బీజింగ్‌ను కట్టడి చేసేందుకు ఏర్పాటు చేసిన ఈ కూటమి విఫలమవ్వడం ఖాయమని పేర్కొంది. జపాన్‌లో మంగళవారం (మే 24) జరగనున్న క్వాడ్‌ శిఖరాగ్ర సదస్సు.. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో డ్రాగన్‌ను కట్టడి చేసే ప్రధాన ఎజెండాతోనే సమావేశం కానుందన్న వార్తల నేపథ్యంలో చైనా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రధాని మోదీ.. ఈ సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు.. చైనా అంశమూ ఈ చర్చల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఇటీవల లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సుపై చైనా వంతెన నిర్మించడం.. సరిహద్దు పొడుగునా భారీగా మౌలిక వసతులు ఏర్పాటు చేయడం తదితర అంశాలను బైడెన్‌తో భేటీలో మోదీ లేవనెత్తే అవకాశం ఉంది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనా అక్రమ చేపల వేటపైనా క్వాడ్‌ కూటమి కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. దీని కోసం ఉపగ్రహ నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని క్వాడ్‌ దేశాలు భావిస్తున్నాయి. రెండు రోజుల పర్యటనలో మోదీ.. జపాన్‌ ప్రధాని కిషిదతో, ఆస్ట్రేలియా కొత్త ప్రధాని ఆంటోనీ అల్బనీస్‌తో చర్చలు జరపనున్నారు.

కూటమి విఫలమవ్వడం ఖాయం

ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాణిజ్యం పేరుతో ఏర్పడ్డ కూటమి అసలు లక్ష్యం తామేనేని చైనా ఆదివారం పేర్కొంది. గతంలో ఈ కూటమిని ‘ఆసియా నాటో’గా చైనా అభివర్ణించింది. తమ దేశం చుట్టూ ఉన్న వాతావరణం మార్చడమే క్వాడ్‌ లక్ష్యమని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ పేర్కొన్నారు. ఇది కచ్చితంగా విఫలమవుతుందని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని