అభివృద్ధిలో, రాయితీల్లో మేమే ముందు

పెట్రో ఉత్పత్తులపై రెండుసార్లు తగ్గించిన సుంకాల కారణంగా పడే భారాన్ని పూర్తిగా కేంద్రమే భరిస్తుందని, రాష్ట్రాలకు పంపిణీ చేసే సుంకంలో కోతపడే అవకాశమే లేదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టంచేశారు.

Updated : 23 May 2022 08:47 IST

 ఎనిమిదేళ్లలో రూ.24 లక్షల కోట్ల సబ్సిడీలిచ్చాం

యూపీఏ పదేళ్ల పాలనలో రూ.13 లక్షల కోట్లే: నిర్మల

ఈనాడు, దిల్లీ: పెట్రో ఉత్పత్తులపై రెండుసార్లు తగ్గించిన సుంకాల కారణంగా పడే భారాన్ని పూర్తిగా కేంద్రమే భరిస్తుందని, రాష్ట్రాలకు పంపిణీ చేసే సుంకంలో కోతపడే అవకాశమే లేదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టంచేశారు. పెట్రోలు, డీజిల్‌ ధరల తగ్గింపుతో ప్రజలకు ఒరిగేదేమీలేదని, పెంచిన వాటినే కేంద్రం తగ్గించిందని కాంగ్రెస్‌ ఆరోపించిన నేపథ్యంలో ఆమె ఎదురుదాడికి దిగారు. రాష్ట్రాల పన్ను వాటాల్లో కోత పడనుందని మాజీ మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. ‘‘ఆహారం, ఇంధనం, ఎరువుల రాయితీ కింద ఎన్డీయే రూ.24.85 లక్షల కోట్లు ఖర్చుచేస్తే, పదేళ్ల యూపీఏ పాలనలో రూ.13.9 లక్షల కోట్లే ఖర్చుచేశారు. 2014-22 మధ్య అభివృద్ధి కోసం ఎన్డీయే రూ.90.9 లక్షల కోట్లు వెచ్చిస్తే 2004-14 మధ్య యూపీయే రూ.49.2 లక్షల కోట్లే ఖర్చుపెట్టింది’’ అని ఆమె ఆదివారం ట్విటర్‌ ద్వారా పేర్కొన్నారు.

ఏటా రూ.2.20 లక్షల కోట్లు కోల్పోతాం

‘‘పెట్రో ఉత్పత్తులపై ప్రాథమిక ఎక్సైజ్‌ సుంకం, ప్రత్యేక అదనపు సుంకం, రహదారి-మౌలిక సదుపాయాల సెస్సు, వ్యవసాయరంగ అభివృద్ధి సెస్సు కలిపి ఉంటాయి. ప్రాథమిక ఎక్సైజ్‌ సుంకాన్ని మాత్రమే రాష్ట్రాలకు పంచుతాం. తాజాగా తగ్గించిన సుంకం పూర్తిగా రహదారి-మౌలిక సదుపాయాల సెస్సుకు సంబంధించినదే. నవంబరులోనూ ఇలాగే చేశాం. తగ్గింపు వల్ల పడే భారాన్ని పూర్తిగా కేంద్రమే భరిస్తోంది. నవంబరులో తగ్గించినదానితో కలిపి ప్రభుత్వం సాలీనా రూ.2.20 లక్షల కోట్ల ఆదాయం కోల్పోనుంది’’ అని నిర్మల వివరించారు. అదనపు ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించుకుంటున్నందువల్ల భారమంతా కేంద్రంపైనే పడుతుందని, ఆ మేరకు తన వ్యాఖ్యను సరిచేసుకుంటున్నానని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ట్వీట్‌ చేశారు.

మూడు రాష్ట్రాల్లో వ్యాట్‌ తగ్గింపు

పెట్రోలు, డీజిల్‌పై ‘విలువ ఆధారిత పన్ను’ (వ్యాట్‌)ను తగ్గిస్తున్నట్లు మహారాష్ట్ర, కేరళ, రాజస్థాన్‌ ప్రకటించాయి. మహారాష్ట్రలో పెట్రోలుపై లీటరుకు రూ.2.08, డీజిల్‌పై రూ.1.44 తగ్గనున్నాయి. రాజస్థాన్‌లో ఈ తగ్గింపు రూ.2.48, రూ.1.16గా ఉంటుంది. ఇలాంటి తగ్గింపును ఆశించడం సబబు కాదని తమిళనాడు సహా పలు రాష్ట్రాలు తెగేసి చెప్పాయి. రెండోసారి తాము సుంకాన్ని తగ్గించిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో పెట్రోలు ధరలు భాజపా పాలిత రాష్ట్రాల కంటే లీటరుకు రూ.10-15 ఎక్కువగా ఉన్నాయని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పురి చెప్పారు.

* పెట్రో ఉత్పత్తులపై భారత్‌ నిర్ణయాన్ని పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని