Updated : 25 May 2022 05:41 IST

భారత్‌-అమెరికాలది విశ్వసనీయ బంధం

మరిన్ని రంగాల్లో కలిసి పనిచేద్దాం
ప్రపంచ శాంతి, సుస్థిరతలకు మన బంధం దోహదం
ప్రధాని మోదీ ఉద్ఘాటన
మీరు కరోనాను సమర్థంగా ఎదుర్కొన్నారు..భేష్‌: బైడెన్‌

టోక్యో: భారత్‌-అమెరికాల మధ్య విశ్వసనీయమైన భాగస్వామ్య బంధం ఉందనీ, ప్రపంచంలో శాంతి-సుస్థిరతలు పరిఢవిల్లేలా.. మానవాళికి మేలు చేసేలా ఈ మిత్రత్వం కొనసాగుతుందని భారత ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. జపాన్‌లో క్వాడ్‌ సదస్సులో పాల్గొన్న ఇరువురు నేతలు మంగళవారం విడిగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వర్థమాన, స్వేచ్ఛాయుత, అనుసంధానిత, సురక్షితమైన ప్రపంచం కోసం కలిసి పనిచేస్తామని నేతలిద్దరూ ప్రతినబూనారు. ఒకే విధమైన ఆలోచనలు, ఉమ్మడి ప్రయోజనాలు ఇరు దేశాల బంధాన్ని బలోపేతం చేశాయని మోదీ చెప్పారు. ఇండో-పసిఫిక్‌ అంశంపై ఆలోచన విధానం ఒక్కలాగే ఉందన్నారు. ‘వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించి ఇరు దేశాల మధ్య బంధం గతంలో కంటే మెరుగైనా, ఆశించిన స్థాయికి అది ఇంకా చేరుకోలేదు. పెట్టుబడుల ప్రోత్సాహక ఒప్పందంతో ఇరు దేశాల మధ్య వ్యాపార బంధం బలోపేతమవుతుంది. భారత్‌లో తయారీ కార్యక్రమం/ ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద మా దేశానికి వచ్చి రక్షణరంగ ఉత్పత్తుల తయారీలో అమెరికా పారిశ్రామిక వేత్తలు భాగస్వాములు కావాలి’ అని మోదీ పిలుపునిచ్చారు. ‘చర్చలు ఫలప్రదంగా సాగాయి. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ రంగాల్లోనే కాకుండా ప్రజల మధ్య సంబంధాల విషయంలోనూ విస్తృతంగా చర్చించుకున్నాం’ అని ఆయన ట్వీట్‌ చేశారు.

కలిసి చాలా సాధించగలం: బైడెన్‌

భారత్‌, అమెరికా కలిసి చాలా సాధించగలవని బైడెన్‌ విశ్వాసం వ్యక్తంచేశారు. రెండు దేశాల సంబంధాలను ఈ భూగోళం మీద అత్యంత సన్నిహితమైనవిగా మార్చేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. సమర్థించుకోలేని రీతిలో ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధం వల్ల తలెత్తుతున్న పరిణామాల గురించి తాము చర్చించినట్లు వెల్లడించారు. యుద్ధ విపరిణామాలను ఎదుర్కొనేందుకు భారత్‌తో సంప్రదింపులను కొనసాగిస్తామని తెలిపారు. కరోనాను ఎదుర్కోవడంలో చైనా విఫలం కాగా, భారత్‌ మాత్రం విజయం సాధించిందని కొనియాడారు. కరోనా వ్యాక్సిన్ల సరఫరాలో భారతదేశ పాత్రకు బైడెన్‌తో పాటు ఇతర దేశాధినేతలూ కితాబిచ్చారు.

భద్రత సంస్థల మధ్య ఒప్పందం

సంక్లిష్టమైన, అధునాతనమైన సాంకేతిక రంగాల్లో ఇరు దేశాల భద్రత సంస్థల మధ్య సహకారాన్ని (ఐసీఈటీ) పెంచేలా భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నట్లు చర్చల అనంతరం భారత్‌, అమెరికా ప్రకటించాయి. రెండు దేశాల జాతీయ భద్రత మండళ్లు దీనికి నేతృత్వం వహిస్తాయి. కృత్రిమ మేధ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, 5జి, 6జి, బయోటెక్‌, అంతరిక్షం, సెమీ కండక్టర్లు వంటి రంగాల్లో ప్రభుత్వం-పరిశ్రమల మధ్య అనుసంధానతకు ఇదొక వేదికగా నిలుస్తుంది. టీకాలపై పరిశోధనలకు కార్యాచరణ కార్యక్రమాన్ని 2027 వరకు పొడిగించాలని కూడా రెండు దేశాలూ నిర్ణయించాయి. 34 దేశాల సంయుక్త సైనిక దళాల్లో భారతదేశం చేరబోతోందని శ్వేతసౌధం ప్రకటించింది. రక్షణ రంగంలో సంయుక్త భాగస్వామ్యాన్ని, ఇరు దేశాలకూ ప్రయోజనం కల్పించే ఆర్థిక ఒప్పందాలను కుదుర్చుకొనేందుకు, ఆరోగ్య రంగంలో భాగస్వామ్యానికి కలిసి పనిచేయనున్నట్లు భారత్‌, అమెరికా తెలిపాయి. శుద్ధ ఇంధన రంగంలో, ముఖ్యంగా పునరుత్పాదక ఇంధన వినియోగంలో, కర్బన ఉద్గారాల తగ్గింపులో భాగస్వామ్యాన్ని పరిపుష్టం చేసుకోనున్నట్లు వెల్లడించాయి. భారత సాంకేతికత నవకల్పనల హబ్‌లలో 25 సంయుక్త పరిశోధన ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు అమెరికా తెలిపింది.

రక్షణరంగంలో జపాన్‌తో మరింత సహకారం

టోక్యోకు వచ్చిన మోదీ మంగళవారం జపాన్‌ ప్రధాని ఫుమియొ కిషిదతో చర్చలు జరిపారు. భద్రత, రక్షణ రంగాల్లో సహకారాన్ని మరింత విస్తృతం చేసుకోవాలని నిర్ణయించారు. రక్షణ ఉత్పత్తుల తయారీలోనూ సహకరించుకోనున్నట్లు ప్రకటించాయి. రాబోయే ఐదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కలిపి 5 లక్షల కోట్ల యెన్‌ల పెట్టుబడుల్ని భారత్‌లో పెట్టాలన్న నిర్ణయాన్ని అమలు పరచడంపై సంయుక్తంగా కృషి చేయాలని ఇద్దరు నేతలూ నిర్ణయించారు. జపాన్‌ మాజీ ప్రధానమంత్రులు షింజో అబె, యొషిహిదె సుగా, యోషిరొ మోరిలతోనూ మోదీ భేటీ అయ్యారు.

భారత్‌ పర్యటనకు రావాల్సిందిగా ఆస్ట్రేలియా ప్రధానికి ఆహ్వానం  

ఆస్ట్రేలియా నూతన ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తోనూ మోదీ చర్చలు జరిపారు. ద్వైపాక్షిక వ్యూహాత్మక బంధాలకు ఊతమిచ్చేలా వివిధ రంగాల్లో చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. భాగస్వామ్యం వల్ల రెండు దేశాలకే కాకుండా ప్రపంచానికీ లబ్ధి కలుగుతుందన్నారు. సాధ్యమైనంత త్వరగా భారత్‌లో పర్యటించాలని మోదీ ఆహ్వానించారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని