పెంపుడు శునకం కోసం స్టేడియం ఖాళీ చేయించిన ఐఏఎస్‌ దంపతులపై బదిలీ వేటు

తమ పెంపుడు శునకంతో కలసి వ్యాహ్యాళికి వెళ్లడానికి దిల్లీ స్టేడియం నుంచి క్రీడాకారులను బలవంతంగా ఖాళీ చేయించి ఇబ్బందిపెట్టిన ఐఏఎస్‌ దంపతులు సంజీవ్‌ ఖిర్వాడ్‌, అనూ దుగ్గపై కేంద్ర

Published : 27 May 2022 05:24 IST

ఈనాడు, దిల్లీ: తమ పెంపుడు శునకంతో కలసి వ్యాహ్యాళికి వెళ్లడానికి దిల్లీ స్టేడియం నుంచి క్రీడాకారులను బలవంతంగా ఖాళీ చేయించి ఇబ్బందిపెట్టిన ఐఏఎస్‌ దంపతులు సంజీవ్‌ ఖిర్వాడ్‌, అనూ దుగ్గపై కేంద్ర హోంశాఖ చర్యలు చేపట్టింది. సంజీవ్‌ను లద్దాఖ్‌కు, అనూను అరుణాచల్‌ ప్రదేశ్‌కు బదిలీ చేసింది. వీరి వ్యవహార శైలిపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్ర ప్రభుత్వం గురువారం ఆగమేఘాల మీద ఈ నిర్ణయం తీసుకొంది. దిల్లీ ప్రభుత్వంలో ముఖ్య కార్యదర్శి(రెవెన్యూ)గా పనిచేస్తున్న సంజీవ్‌, ఆయన భార్య అనూ తమ కుక్కతో కలసి ఇక్కడి త్యాగరాజ స్టేడియంలో సాయంత్రం వాకింగ్‌ చేయడానికి వెళ్తుంటారు. అయితే అక్కడ సాధన చేసే క్రీడాకారులను కొన్ని నెలలుగా సాధారణ సమయం కన్నా ముందుగానే బలవంతంగా బయటికి పంపుతున్నట్లు వార్తలు రావడం దుమారం రేపింది. క్రీడాకారులను ఖాళీ చేయించిన తరువాత సంజీవ్‌ దంపతులు తమ పెంపుడు కుక్కతో స్టేడియంలోకి అడుగుపెడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే గురువారం దిల్లీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ప్రభుత్వం ఆధ్వర్యంలోని అన్ని క్రీడా ప్రాంగణాలను రాత్రి 10 గంటల వరకూ తెరిచి ఉంచేలా ఆదేశాలు జారీ చేసింది. అదేరోజు కేంద్ర ప్రభుత్వం సంజీవ్‌ దంపతులపై బదిలీ వేటు వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని